హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ల మాస్టర్ ప్లాన్

హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ల మాస్టర్ ప్లాన్

హైదరాబాద్​, వెలుగు: గంజాయి స్మగ్లింగ్​కు మహారాష్ట్ర గంజాయి మాఫియా కొత్త ఎత్తులు వేస్తోంది. హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్​ (ఓఆర్​ఆర్​) నుంచి మహారాష్ట్ర, బెంగళూరుకు స్మగ్లింగ్​ చేస్తోంది. పోలీసుల పెట్రోలింగ్​ ఎక్కువగా ఉండని టైంలో ట్రాన్స్​పోర్టేషన్​కు ప్లాన్​ చేస్తోంది. అర్ధరాత్రి దాటాక 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఒడిశా, ఏపీ, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్స్​.. ప్రైవేట్​ లారీలు, కార్లతో కమీషన్లను మాట్లాడుకుని హైదరాబాద్​, జహీరాబాద్​లలోని ఏజెంట్లకు గంజాయిని అందిస్తోంది. గంజాయి స్మగ్లింగ్​ చేసే వెహికల్​ ముందు పైలెట్​ వెహికల్స్​నూ నడుపుతోంది. పోలీసులున్నారని తెలిస్తే వెంటనే.. గంజాయి వెహికల్స్​కు వీరు మెసేజ్​ పంపిస్తారు.

మామూలు ఫోన్ల వాడకం

వైజాగ్​ నుంచి ట్రాన్స్​పోర్ట్​ చేసే గంజాయిని పోలీసుల కళ్లుగప్పి తరలించేలా ప్లాన్​ చేశారు. విజయవాడ, హైదరాబాద్​ హైవేలో రాత్రిపూటే ప్రయాణిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పండ్లు, కూరగాయలు, ఎరువుల బస్తాల మధ్య గంజాయిని పెట్టి స్మగ్లింగ్​ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఓఆర్​ఆర్​కు చేరుకుని.. అక్కడి నుంచి ఘట్​కేసర్​, శంషాబాద్​ల మీదుగా మహారాష్ట్ర, నాగ్​పూర్, బెంగళూరు, జహీరాబాద్​కు గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి లోడ్​ను బట్టి వెహికల్​కు ముందు ఐదుగురు పైలెటింగ్​ చేస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే లారీ లేదా కారు డ్రైవర్​ను అలర్ట్​ చేస్తున్నారు. వెహికల్​ను ఆపేసి రిపేర్​ చేసినట్టుగా నటిస్తున్నారు.

స్మార్ట్​ఫోన్లు వాడితే దొరికిపోతారన్న ఉద్దేశంతో మామూలు ఫోన్లతోనే కాంటాక్ట్స్​ మెయింటెయిన్​ చేస్తున్నారు. టోల్​గేట్ల వద్ద డ్రైవర్లు మారుతున్నారు. ప్రధాన నిందితులతో కాకుండా కేవలం ట్రాన్స్​పోర్ట్​ చేసే వారితోనే ఫోన్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్​లోని మంగళ్​హాట్, ధూల్​పేట్​, నాంపల్లి ఏరియాల్లోని రిటైల్ వ్యాపారులకు సప్లై చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ట్రిప్​కు రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా వసూలు చేస్తున్నారు.

ఎరువుల్లో పెట్టి తీసుకెళ్లిన్రు

రాచకొండ పోలీసులు ఈ నెల 25న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్​ చేశారు. వైజాగ్​ సీలేరు ‌నుంచి మహారాష్ట్ర ఉస్మానాబాద్​కు తరలిస్తున్న 1,820 కిలో గంజాయి, లారీ, పైలెటింగ్​ కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. స్మగ్లింగ్​పై సమాచారం అందుకున్న ఎల్బీనగర్​ ఎస్వోటీ పోలీసులు.. పెద్దఅంబర్​పేట్​ ఓఆర్​ఆర్​ వద్ద నిందితులను అరెస్ట్​ చేశారు. గత ఆగస్టులో పూల కుండీల మధ్య పెట్టి తరలిస్తున్న రూ.21 కోట్ల విలువైన 3,400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర గ్యాంగ్​ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్​ చేశారు.

గట్టి నిఘా పెట్టినం

గంజాయి స్మగ్లర్లపై గట్టి నిఘా పెట్టాం. ఇప్పటికే రాచకొండ పరిధిలో 3 వేల కిలోలకుపైగా గంజాయిని పట్టుకున్నాం. ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​తో స్మగ్లర్ల నెట్​వర్క్​ను తెలుసుకుంటు న్నాం. ఓఆర్‌‌ఆర్‌‌ ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్​పై నిఘా పెట్టేందుకు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక పోలీసులతో కోఆర్డినేట్​ చేసుకుంటున్నాం. పాత నేరస్తులు ఇచ్చే సమాచారం ఆధారంగా ముఖ్యమైన నిందితులను పట్టుకుంటున్నాం. – మహేశ్​ భగవత్​, సీపీ, రాచకొండ