న్యూఢిల్లీ: ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ కేన్స్ టెక్నాలజీ షేర్లు సోమవారం మరో 13 శాతం పడ్డాయి. గత ఐదు రోజుల్లో 24 శాతం నష్టపోయాయి. అకౌంటింగ్‌లో తప్పులున్నాయని, ఆర్థిక లెక్కల్లో స్పష్టత లేదని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, బీఎన్‌పీ పారిబా, ఇన్వెస్టెక్ వంటి బ్రోకరేజ్ సంస్థలు రిపోర్ట్ చేయడంతో కంపెనీ షేర్లు పడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్లను భారీగా అమ్మేస్తున్నారు.
గత మూడు రోజుల్లో కేన్స్ టెక్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.10 వేల కోట్లు తగ్గింది. మరోవైపు అకౌంటింగ్ తప్పులేమి జరగలేదని కంపెనీ క్లారిఫై చేసింది. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ టెక్నాలజీని తయారు చేసే సెన్సోనిక్ కొనుగోలులో ఎటువంటి ఇంటాంజిబుల్ అసెట్స్ (పేటెంట్స్, ట్రేడ్‌మార్క్స్, కాపీరైట్స్ వంటివి) లేవని, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో తప్పులులేవని పేర్కొంది. కానీ, ఒక సబ్సిడరీలో చిన్న టైపింగ్ తప్పిదం మాత్రమే జరిగిందని, వెంటనే సరిచేస్తామని కేన్స్ వివరణ ఇచ్చింది.
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్‌లోని ఆరోపణలు సరైనవి కావని మేనేజ్‌మెంట్ పేర్కొంది. కంపెనీకి సంబంధించి కస్టమర్ల నుంచి రావాల్సిన డబ్బుకు పట్టే కాలం (నెట్ వర్కింగ్ క్యాపిటల్ డేస్) 83 నుంచి 87కి పెరిగింది. ఇది ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) పరిశ్రమలో సాధారణమని కేన్స్ పేర్కొంది. ఈ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ 53.46శాతం వద్ద స్థిరంగా ఉండగా, వాటాలు అమ్మే ప్రణాళికలు లేవని వీరు స్పష్టం చేశారు.
కాగా, కేన్స్ టెక్నాలజీ షేరుపై జేపీ మోర్గాన్ “ఓవర్ వెయిట్ (సానుకూలం)” రేటింగ్ కొనసాగిస్తున్నప్పటికీ, షేర్ ఎంత వరకు పడుతుందో అంచనా వేయడం కష్టం అని హెచ్చరించింది. కంపెనీ షేరు సోమవారం రూ.3,807 వద్ద ముగిసింది. ఇది రికార్డు గరిష్టం అయిన రూ.7,822 నుంచి 50 శాతం తక్కువ.
