అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రతిపక్షాల నీచ రాజకీయాలు: కేసీఆర్​

అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రతిపక్షాల నీచ రాజకీయాలు: కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్​చీఫ్, సీఎం కేసీఆర్​అన్నారు. మొన్న కొందరు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిని చంపాలని చూశారని, దేవుడి దయతో అతడు బతికి బయట పడ్డారని, ఇలాంటి హత్యా రాజకీయాలను సహించేది లేదని కేసీఆర్​ పేర్కొన్నారు. మాజీ మంత్రి, సీనియర్​నేత నాగం జనార్దన్​రెడ్డి, జూబ్లీహిల్స్​ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డి, కరీంనగర్​కు చెందిన కాంగ్రెస్ ​నేత కొత్త జయపాల్​రెడ్డి, కరీంనగర్ ​బీజేపీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు మంగళవారం తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​లో చేరారు. కేసీఆర్​వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న హేయమైన దాడులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని కేసీఆర్​సూచించారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా.. ఉపేక్షించేది లేదన్నారు.

మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారని, ఆ తర్వాత జరిగిన ఉద్యమంలోనూ పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన చరిత్ర నాగంది అని గుర్తుచేశారు. ఆయన చేరికతో తమ పార్టీ బలం పెరిగిందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు పద్నాలుగు సీట్లు గెలవడం ఖాయం అయ్యిందన్నారు. జూబ్లీహిల్స్ మాజీ​ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్ ఉందని, అందుకు నాది బాధ్యత అని కేసీఆర్​ హామీ ఇచ్చారు. పీజేఆర్ తనకు మంచి మిత్రుడని, ఆయన కుమారుడు విష్ణు తన కుటుంబ సభ్యుడి లాంటి వాడేనని తెలిపారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, విష్ణు పాత, కొత్త అనే తేడా లేకుండా సమన్వయంతో పని చేసుకోవాలన్నారు. త్వరలోనే తానే స్వయంగా నాగం ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని, అదే సమయంలో అందరినీ మరోసారి కలుస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు సాగుతోందని తెలిపారు. తలసరి ఆదాయం పెరిగిందని, వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంట్​ ఇస్తున్న రాష్ట్రంలో దేశంలో మరొకటి లేదని అన్నారు. ఈ ప్రగతిని ఇలాగే కొనసాగించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్​ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.