సాకులు చెబుతూ అడ్మిషన్లు ఇస్తలేరు : ఓయూలో స్టూడెంట్ల నిరసన

సాకులు చెబుతూ అడ్మిషన్లు ఇస్తలేరు : ఓయూలో స్టూడెంట్ల నిరసన
  • సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరినోళ్లకు ‘నో హాస్టల్’ అంటూ రూల్స్ 
  • పలుచోట్ల డిగ్రీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తలేరు 
  • కొన్నిచోట్ల క్లాసులు ప్రారంభమైనా మెస్ లు ఓపెన్ చేస్తలేరు 
  • హాస్టల్ ఫెసిలిటీ కోసం రోజుకో చోట స్టూడెంట్ల నిరసన  
  • తాజాగా ఓయూలో ఆందోళన 
  • స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా హాస్టళ్లను పెంచని సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకు హాస్టల్ వసతి అందడం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఇన్ని రోజులు హాస్టల్ సౌకర్యం కల్పించగా.. ఈ ఏడాది నుంచి ‘‘నో హాస్టల్’’ అంటూ వీసీలు కొత్త రూల్ తీసుకొచ్చారు. ఈ మేరకు అడ్మిషన్ల టైమ్​లోనే విద్యార్థుల నుంచి అండర్ టేకింగ్ కూడా తీసుకుంటున్నారు. దీంతో వేలాది మంది స్టూడెంట్లు బయట ప్రైవేట్ హాస్టళ్లు, రూమ్స్​లో ఉండాల్సి వస్తోంది. ఆర్థిక స్తోమత లేకనే సర్కార్ వర్సిటీల్లో చదువుకోవడానికి వస్తే.. తాము ఉండేందుకు హాస్టల్ ఇవ్వకపోతే, ఇక తామెలా చదువుకోవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్టళ్లలో వేలాది రూపాయలు చెల్లించలేక ఆందోళన బాట పడుతున్నారు.

ఇక ఫస్ట్ ఇయర్ లో మెస్ బకాయిలు మొత్తం చెల్లిస్తేనే సెకండియర్ లో మెస్ కార్డు ఇస్తున్నారు. కొన్ని వర్సిటీల్లో యూజీ స్టూడెంట్లకు హాస్టల్ సౌకర్యమే కల్పించడం లేదు. మరికొన్ని చోట్ల క్లాసులు ప్రారంభమైనా మెస్ లను ఓపెన్ చేయడం లేదు. దీంతో రోజూ ఏదో ఒక వర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ కోసం స్టూడెంట్లు ఆందోళన బాట పడుతున్నారు. మెస్ లు ఓపెన్ చేయాలంటూ ఖాళీ ప్లేట్లతో రోడ్డెక్కుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ మొదలుకొని  ఉస్మానియా, కాకతీయ, శాతవాహన తదితర యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ సెంటర్లలో స్టూడెంట్లు నిరసనలు చేస్తున్నారు. సర్కార్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్లను పెంచకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. సరిపడా రూమ్స్ లేక నలుగురైదుగురు ఉండాల్సిన రూమ్ లో 10 మంది స్టూడెంట్లు అడ్జస్ట్ కావాల్సి వస్తోంది. 

పాడువడ్డ బిల్డింగుల్లో ఓయూ హాస్టళ్లు.. 

ఓయూలో హాస్టళ్లు అధ్వానంగా మారాయి. నిజాం కాలం నాటి ఈ బిల్డింగ్ లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు ఏడు వేల మంది స్టూడెంట్లు  ఇబ్బందులు పడుతున్నారు. క్యాంపస్ లోని ఈ-1, ఈ-2, డీ, టెక్నాలజీ హాస్టల్ బిల్డింగులన్నీ నిజాం కాలంలో గుర్రాల కోసం నిర్మించిన రేకుల షెడ్లు. ఇద్దరు ఉండాల్సిన రూమ్ లో ఐదారుగురు ఉంటున్నారు. హాస్టళ్లలో సరిపడా బాత్రూంలు లేక విద్యార్థులు బయటే స్నానం చేయాల్సి వస్తోంది. లేడీస్ హాస్టళ్లలోనూ అమ్మాయిలకు సరిపడా బాత్ రూమ్ లు లేవు. వాష్ రూమ్ ల కోసం గంటల తరబడి క్యూలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూలో తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క హాస్టల్ బిల్డింగ్ కూడా కట్టలేదు.

బాసర ట్రిపుల్ ఐటీతో మొదలు... 

ఈ అకడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక చోట హాస్టల్ సమస్యలు, భోజనంలో నాణ్యత లోపించడం, ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. జూన్ లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. చివరికి  ప్రభుత్వం దిగొచ్చి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. ట్రిపుల్ ఐటీ తరహాలోనే ఇటీవల నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థులు హాస్టల్ ఫెసిలిటీ కోసం 15 రోజుల పాటు ఉద్యమించారు. ప్రభుత్వం దిగొచ్చి కొత్త హాస్టల్ పూర్తిగా యూజీ స్టూడెంట్లకే కేటాయిస్తామని చెప్పింది. ఇలా విద్యార్థులు ఉద్యమిస్తే తప్ప.. సర్కార్ నుంచి స్పందన ఉండడం లేదు. నిజాం కాలేజీ స్టూడెంట్స్ లాగే ఓయూ అనుబంధమైన సికింద్రాబాద్ పీజీ సెంటర్, సైఫాబాద్ కాలేజీలోనూ హాస్టల్ ఫెసిలిటీ కోసం యూజీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కాకతీయ వర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ తో పాటు కొన్ని బ్రాంచ్ ల ఇంజినీరింగ్ స్టూడెంట్లకు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకపోవడంతో ఏబీవీపీ విద్యార్థులు ఇటీవల వరుసగా ఆందోళనలు నిర్వహించగా, ఆరుగురు స్టూడెంట్ లీడర్లపై కేసులు పెట్టారు. కరీంనగర్ లోని శాతవాహన వర్సిటీ ఫార్మసీ హాస్టల్ లో వంట మనిషి లేక వేళకు తిండి పెట్టడం లేదని విద్యార్థులు ఇటీవల రోడ్డెక్కారు. ఖాళీ ప్లేట్లతో రోడ్డు పైకి వచ్చి యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్లారు. 

ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత 

ఓయూ, వెలుగు: ఓయూలోని ఈ2 హాస్టల్, మెస్ ఓపెన్ చేయాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం విద్యార్థులంతా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులోకి దూసుకెళ్లడంతో టెన్షన్ నెలకొంది. మొదట అక్టోబరు 26న, తర్వాత ఈ నెల మొదటి వారంలో ఓపెన్ చేస్తామన్న అధికారులు.. మళ్లీ ఈ నెల చివరి వారానికి వాయిదా వేశారు. దీంతో గత మూడ్రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీసీని కలిసేందుకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగుకు రాగా వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు కొంతమంది గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లారు. సిబ్బంది గేటుకు తాళం వేయగా బద్దలుకొట్టారు. ఈ టైమ్ లో జరిగిన తోపులాటలో పీడీఎస్ యూ లీడర్ ప్రవీణ్ కుమార్ కు గాయమైంది. విద్యార్థులు వీసీ పేషీ డోర్లను తోయడంతో అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు అక్కడ బైఠాయించి వీసీ రావాలని ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి ఓయూ స్టేషన్ కు తరలించారు. మెస్ లను వెంటనే ప్రారంభించకపోతే శనివారం కొత్త హాస్టల్ శంకుస్థాపన కోసం క్యాంపస్ కు రానున్న మంత్రులను అడ్డుకుంటామని స్టూడెంట్లు హెచ్చరించారు. మరోవైపు ఓయూలో సెల్ఫ్​ఫైనాన్స్​కోర్సుల్లో అడ్మిషన్​పొందిన విద్యార్థులకు కూడా హాస్టల్ సదుపాయం కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద నిరసన తెలిపారు. కాగా, సెల్స్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులకు మినహా అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తున్నామని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు బయటి వ్యక్తులు కావాలనే గొడవ చేస్తున్నారన్నారు. 

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు మూసివేయాలని కుట్ర..   

ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో గత 20 ఏండ్లలో కొత్త కోర్సులన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలోనే ప్రారంభించారు. ఈ కోర్సుల్లో చేరిన వారికి పోయినేడాది వరకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించారు. కానీ ఈ ఏడాది నుంచే లేదంటున్నారు. హాస్టల్ లేకపోవడంతో ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. స్టూడెంట్స్ లేరనే సాకుతో కోర్సులను ఎత్తేయాలనే కుట్రలో భాగంగానే హాస్టల్ ఫెసిలిటీ తీసేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాకతీయ వర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు సగం వరకు ఉన్నాయి. బిల్డింగ్స్ సరిపోక ఈ కోర్సుల విద్యార్థులకు హాస్టల్ ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. దీంతో చాలా కోర్సుల్లో 10కి మించి అడ్మిషన్లు కావట్లేదు.