క‌రోనా నుంచి కాపాడి.. ఆక‌లికి బ‌లిపెట్ట‌లేం

క‌రోనా నుంచి కాపాడి.. ఆక‌లికి బ‌లిపెట్ట‌లేం

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డంలో దేశంలోనే ది బెస్ట్ అనిపించుకుంటున్న‌ కేర‌ళ లాక్ డౌన్ స‌డ‌లింపులోనూ మ‌రింత జాగ్ర‌త్తగా అడుగులేస్తోంది. క‌రోనా కేసుల సంఖ్య‌ను బ‌ట్టి జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభ‌జించి ప‌ర్య‌వేక్షించేందుకు సిద్ధ‌మైంది. ఆంక్ష‌ల నుంచి రిలాక్సేష‌న్ ఇవ్వ‌డ‌మంటే క‌రోనాపై పోరాటంలో రిలాక్స్ అవ‌డం కాద‌ని చెప్పారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇన్నాళ్ల క‌ష్టానికి ఫ‌లితం క‌నిపిస్తోంద‌ని, గ‌డిచిన వారం రోజులుగా కొత్త క‌రోనా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ దాట‌లేద‌ని చెప్పారు. ఇది మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యమ‌ని అన్నారు. అయితే బ‌తుకు బండిని కూడా న‌డిపించాల‌ని చెప్పారు.

ప్ర‌జ‌ల‌ను క‌రోనా నుంచి కాపాడి ఆక‌లికి బ‌లి చేయ‌డం స‌రికాద‌ని అన్నారు మంత్రి కేకే శైల‌జ‌. ఏప్రిల్ 20 నుంచి కేంద్ర సూచించిన కొన్ని సేవ‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌కు లాక్ డౌన్ ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఇస్తామ‌ని చెప్పారు. అయితే రిలీఫ్ దొరికింది క‌దా అని ఈ స‌మ‌యంలో అజాగ్ర‌త్త‌గా ఉండ‌కూడ‌ద‌ని, ఇన్నాళ్లు ఉన్న అప్ర‌మ‌త్త‌త‌ను కొన‌సాగించాల‌ని సూచించారు. ఎకాన‌మీని గాడిన పెట్టుకునేందుకు ఈ టైమ్ ను ఉప‌యోగించుకోవాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్ స‌హా అన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించాల‌ని చెప్పారు.

దేశంలో తొలి క‌రోనా కేసు కేర‌ళ‌లోనే న‌మోదైంది. చైనా నుంచి వ‌చ్చిన మెడిక‌ల్ విద్యార్థుల‌కు వైర‌స్ సోకిన‌ట్లు జ‌న‌వ‌రి 30న గుర్తించారు. ఆ వెంట‌నే కేర‌ళ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. ఎప్పిటిక‌ప్పుడు ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తూ వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. ప్రస్తుతం దేశ్యాప్తంగా 14378 క‌రోనా కేసులుండ‌గా.. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 3323 మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఒక దశ‌లో దేశంలోనే ఎక్కువ కేసుల‌తో ఉన్న కేర‌ళ ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ చేయ‌గ‌లిగింది. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 396 మందికి వైర‌స్ సోక‌గా.. 255 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.