కంటోన్మెంట్ ఎన్నికలకు బ్రేక్ పడనుందా?

కంటోన్మెంట్ ఎన్నికలకు బ్రేక్ పడనుందా?

కంటోన్మెంట్, వెలుగు: బల్దియాలో కంటోన్మెంట్ విలీన ప్రక్రియతో బోర్డు ఎన్నికలకు బ్రేక్ పడేలా ఉంది. కంటోన్మెంట్​ను ఓ వైపు జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు ఏప్రిల్ 30న బోర్డు పాలకమండలికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు  కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల నోటిఫికేషన్​ను రద్దు చేయాలని కోరుతూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు ఈ నెల 7న హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణను హైకోర్టు ఇవ్వాల చేపట్టనుంది. దీంతో ఎన్నికలు జరుగుతాయో లేదోనని రాజకీయ నాయకుల్లో టెన్షన్ మొదలైంది.  ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికల అంశాన్ని పరిశీలించాలని వికాస్​ మంచ్​ స్వచ్చంద సంస్థ సభ్యులు కోరుతున్నారు.  

గత నెలలో లీగల్ నోటీసులు 

బల్దియాలో కంటోన్మెంట్​ను విలీనం చేయాలని ఏండ్లుగా అక్కడి జనాలు డిమాండ్ చేస్తుండటంతో కేంద్రరక్షణ మంత్రిత్వ శాఖ అందుకు ఒప్పుకుని.. గతేడాది 8 మందితో కూడిన హైపవర్ కమిటీని నియమించింది. కంటోన్మెంట్​ పరిధిలోని ఆస్తులు, స్థలాల వివరాలను సేకరించిన కమిటీ రిపోర్టును సైతం రూపొందించింది. నిధుల బకాయిలు, ఇతర సంస్థలకు చెల్లించాల్సిన అప్పులతో కూడిన రిపోర్టును తయారు చేసింది. విలీన ప్రక్రియలో వేగం పెరగడంతో దాదాపు 80 శాతం వరకు అందుకు సంబంధించిన రిపోర్టు పూర్తయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా..  కంటోన్మెంట్ బోర్డు పాలక మండలికి ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్​ను గత నెలలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. 8 ఏండ్లుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న స్థానిక లీడర్లు తమ వార్డుల్లో ప్రచారాలు సైతం మొదలుపెట్టారు. అయితే, విలీన ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుండగా.. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటని కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనే స్వచ్చంద సంస్థ బోర్డు అధికారులకు గత నెల 21న లీగల్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని బోర్డు అధికారులను కోరింది. పది రోజులు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంతో వికాస్ మంచ్ ప్రతినిధులు ఈ నెల 6న కోర్టును ఆశ్రయించారు. గురువారం హైకోర్టులో దీనిపై వాదనలు జరుగనున్నట్లు  సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కంటోన్మెంట్​ అంటే మిలటరీ ప్రాంతమే కాదని.. అందులో సివిలియన్​ ఏరియా కూడా ఉంటుందని వికాస్​ మంచ్​ స్వచ్చంద సంస్థ ప్రధాన కార్యదర్శి సుంకి రవీందర్​ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్​తో విలీన అంశం మరుగునపడిపోతుందని భావించి హైకోర్టును ఆశ్రయించామని ఆయన చెప్పారు.