కోలుకోలేకపోతున్న ఎయిర్​లైన్స్​ కంపెనీలు

కోలుకోలేకపోతున్న ఎయిర్​లైన్స్​ కంపెనీలు

వెలుగు బిజినెస్​ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బ నుంచి మన దేశంలోని ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఇంకా కోలుకోలేదు. లాక్​డౌన్​ నేపథ్యంలో రెండు నెలలపాటు విమానాలన్నీ నేలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా విమానాలను అనుమతించినా డిమాండ్​ పుంజుకోలేదు. కొవిడ్​19 కారణంగా కెపాసిటీపై ఆంక్షలను కూడా ప్రభుత్వం విధించింది. కెపాసిటీ కొంత పుంజుకుంటున్న టైములో ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయెల్​ రేట్లు పెరగడం మొదలైంది. మరోవైపు రూపాయి కూడా బలహీనపడటంతో ఎయిర్​లైన్స్​ కంపెనీల లాభాలపై ఎఫెక్ట్​ పడుతోంది. కరోనా నాటి నుంచి కెపాసిటీ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి ఈ ఎయిర్​లైన్స్​ కంపెనీలు.

కొవిడ్​19 ఆంక్షలు...

మే 2020– అక్టోబర్​ 2021 మధ్యలో ఎయిర్​లైన్స్​ కెపాసిటీ మీద 33 శాతం నుంచి 85 శాతం దాకా ఆంక్షలను విధించింది ప్రభుత్వం. దీంతో తమ కెపాసిటీని పూర్తి స్థాయిలో ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఉపయోగించుకోలేకపోయాయి. రెవెన్యూ పెంచుకునే దారిలేకుండా పోవడంతో, లాభాలపైనా ఆ ఎఫెక్ట్​ పడింది. 58 శాతం మార్కెట్ వాటాతో దేశంలోనే అతి పెద్ద ఎయిర్​లైన్స్​గా నిలుస్తున్న ఇండిగో గత 10 క్వార్టర్లలో 9 క్వార్టర్లు నష్టాలను ప్రకటించింది.

దీనిని బట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కిందటేడాది అక్టోబర్​ నుంచి కెపాసిటీ ఆంక్షలు ఎత్తివేసినా, డిమాండ్​ పుంజుకోకపోవడంతో కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికీ విమాన ప్రయాణాలకు డిమాండ్​ ఇంకా పూర్తి స్థాయిలో పెరగలేదనే చెప్పొచ్చు. కొవిడ్​ 19 పలుసార్లు దేశంలోని వివిధ ప్రాంతాలను ఎఫెక్ట్​ చేయడం వల్లే డిమాండ్​ తొలి దశలో పుంజుకోలేదు. అంతేకాదు, విమాన ఛార్జీలు కూడా ఎక్కువగా ఉండటం మరో కారణమైంది. ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయెల్​ రేట్లు పెరగడంతో రూట్ల ఎంపికలోను, కెపాసిటీ వినియోగంలోనూ ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది.

కిందేడాది నుంచి జెట్​ ఫ్యూయెల్ రేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా ఈ రేట్ల పెరుగుదల మరింత జోరయిందని ఇక్రా లిమిటెడ్​ ఏవియేషన్​ సెక్టార్​ హెడ్ సుప్రియో బెనర్జీ చెప్పారు. డిమాండ్​ నిలకడగా లేకపోవడంతో దేశంలోని ఎయిర్​లైన్స్​ కంపెనీలు అధిక కెపాసిటీ సమస్య ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు నెలలో ఇండిగో ఎయిర్​లైన్స్​ 43,171 సర్వీసులను నడిపింది. అంటే వారానికి 9,748. సమ్మర్​ షెడ్యూల్​ కింద ఈ కంపెనీ వారానికి 11,130 సర్వీసులను నడిపేందుకు అనుమతి ఉంది. ఈ అంకెలను బట్టి చూస్తే ఇండిగో ఎయిర్​లైన్స్​ 88 శాతం మత్రమే ఆపరేట్​ చేయగలిగింది.

ఎయిర్​ ఏషియా కూడా ఆగస్టు నెలలో వారానికి 1,010 విమాన సర్వీసులను మాత్రమే నడిపింది. స్పైస్​జెట్​ తనకు అనుమతి ఉన్న షెడ్యూల్​లో 37 శాతం సర్వీసులను మాత్రమే నడపగలిగింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో ఎయిర్​లైన్స్​ ఇండస్ట్రీ రికవరీ బలంగానే కనిపిస్తోంది నిపుణులు చెబుతున్నారు. ఇక్రా అంచనాల ప్రకారం ప్యాసింజర్​ ట్రాఫిక్​ 2024 ఫైనాన్షియల్​ ఇయర్​ నాటికి మాత్రమే కొవిడ్​కు ముందు లెవెల్స్​కు చేరనుంది. కాకపోతే, పండగల సీజన్​లో ఎయిర్​ ట్రావెల్​ డిమాండ్​ జోరందుకుంటుందని కొంత మంది నిపుణులు భావిస్తున్నారు. 

స్పైస్​ జెట్​ షేర్లు జూమ్​...

ఎమర్జన్సీ క్రెడిట్​ లైన్​ గ్యారంటీ స్కీము (ఈసీఎల్​జీఎస్​) కింద రూ. 1,000 కోట్లు రానుందనే వార్తల నేపథ్యంలో గురువారం సెషన్లో స్పైస్​జెట్​ షేర్లు 9 శాతం ఎగిశాయి. ఇంట్రా డేలో ఒక దశలో ఈ షేరు 10.14 శాతం పెరిగి రూ. 42.35 ని తాకింది. చివరి 8.84 శాతం లాభంతో రూ. 41.85 వద్ద ముగిసింది.  ఈసీఎల్​జీఎస్​ కింద ప్రభుత్వం మరో రూ. 1,000 కోట్లను స్పైస్​ జెట్​కు ఇవ్వనున్నట్లు ఏవియేషన్​ రంగ నిపుణులు ఒకరు చెప్పారు. కష్టాలలో ఉన్న స్పైస్​ జెట్​కు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గురువారం నాడు బీఎస్​ఈలో స్పైస్​ జెట్​ షేర్ల వాల్యూమ్​ కూడా 11.28 లక్షలకు పెరిగింది. ఏవియేషన్​ రంగం రికవరీకి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మెచ్చుకోదగ్గదని స్పైస్​ జెట్​ ఛైర్మన్​ అజయ్​ సింగ్​ చెప్పారు. ఏవియేషన్​ టర్బైన్ ​ఫ్యూయెల్​ (ఏటీఎఫ్​)ను జీఎస్​టీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్ క్వార్టర్‌‌ లో  కంపెనీకి ​రూ. 789 కోట్ల నష్టం వచ్చింది.