మద్యం మత్తులో ట్రాఫిల్ సిగ్నల్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

మద్యం మత్తులో ట్రాఫిల్ సిగ్నల్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

హైదరాబాద్ వనస్థలిపురంలో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరందరూ TS05FH2356 నెంబరు గల కారులో ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు బీయన్ రెడ్డి నగర్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నానికి చెందిన సందీప్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘటనాస్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు నడిపిన గౌతమ్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మల్లికార్జున్ అనే మరో యువకుడు ఆక్సిడెంట్ కాగానే భయపడి.. అక్కడి నుంచి పరారయ్యాడు. మల్లికార్జున్ ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మద్యం మత్తులో కారును ఓవర్ స్పీడ్‌తో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గౌతమ్ పై 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం తెలిపారు.