- పోలీసుల అదుపులో ఇద్దరు సూడాన్ దేశస్తులు
- కారులో మరో ఇద్దరు యువతులు ఉన్నట్లు సమాచారం
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఓవర్‌స్పీడ్‌తో టూ వీలర్‌ను ఢీకొట్టడమే కాకుండా డివైడర్‌పైకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, కారులోని సూడాన్ దేశస్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.
కేపీహెచ్‌బీ పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రామరాజు(26) అనే యువకుడు జేఎన్టీయూ ఫ్లైఓవర్ మీదుగా కూకట్పల్లి వైపు వెళుతున్నాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మారుతీ సుజుకి బలెనో కారు అతడిని ఢీకొట్టింది. ఆపై డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామరాజును స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు.
అయితే, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కారులోని ఇద్దరు యువకులను సూడాన్ దేశస్తులుగా గుర్తించారు. వీరిలో బద్రెల్దిన్ (23) అనే యువకుడు నిజాం కాలనీ చైతన్య డీమ్డ్యూనివర్సిటీలో బీసీఏ చదువుతుండగా, సఫ్వాన్ (23) రాజస్థాన్‌లోని అజ్మేర్లోని భగవాన్వర్సిటీలో బీసీఏ చదువుతున్నట్లు గుర్తించారు.
వీరితో పాటు మరో ఇద్దరు యువతులు కూడా కారులో ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత అమ్మాయిలు మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

