
పాల్వంచ, వెలుగు: కారు బ్యానెట్లో గంజా యి తరలిస్తుండగా, మంటలు రావడంతో గుట్టురట్టయింది. ఓవర్ హీట్ కారణంగా కారు బ్యానెట్ లో మంటలు రావడంతో గంజాయి కాలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం వైపు నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న కారులో ఓ మహిళ, డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అయ్యప్ప ఆలయం సమీపంలోకి కారు రాగానే, బ్యానెట్లో నుంచి పొగలు వచ్చాయి.
దీంతో వారు కారును పక్కకు నిలిపి బ్యానెట్ను ఓపెన్ చేయగా, స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. బ్యానెట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిని గమనించిన డ్రైవర్, ఆ మహిళ అక్కడి నుంచి జారుకున్నారు. ఘటనా స్థలానికి అడిషన ల్ ఎస్సైలు సుమన్, జీవన్ రాజ్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకొని, గంజాయితో పాటు కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత విలు వ ఉంటుందనే విషయంపై ఆరా తీస్తున్నారు