Car Lounge: హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్.. బయటపడ్డ రూ.100 కోట్ల స్కామ్..

Car Lounge:  హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్.. బయటపడ్డ రూ.100 కోట్ల స్కామ్..

హైదరాబాదు కేంద్రంగా లగ్జరీ కార్లను విక్రయిస్తు్న్న సంస్థ కార్ లాంజ్ ఆటో లవర్స్ కి సుపరిచితమే. ఈ సంస్థ ఇతర దేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తుంటుంది. అయితే తాజాగా రూ.100 కోట్ల కస్టమర్స్ పన్ను  ఎగవేత కేసులో అధికారులు కార్ లాంజ్ యజమాని బషరత్ ఖాన్‌ను గుజరాత్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఖాన్ లగ్జరీ కార్ల దిగుమతిలో పన్ను ఎగవేతలకు కేంద్రంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. ఖాన్ అనేక లగ్జరీ కార్లను అమెరికా, జపాన్ నుంచి కొనుగోలు చేసేవాడని వారు గుర్తించారు. అయితే తొలుత వాహనాలను దుబాయ్, శ్రీలంకకు తరలించేవాడని.. అక్కడ వాటిని భారత రవాణా చట్టాలకు వీలుగా ఎడమవైపు డ్రైవింగ్ నుంచి కుడివైపు డ్రైవింగ్ కి వీలుగా మార్పులు చేసేవాడు. మార్పుల తర్వాత తప్పుడు డాక్యుమెంట్లు, ఫేక్ ఇన్వాయిస్ లను ఉపయోగించి భారతదేశంలోకి దిగుమతి చేసేవాడని తేలింది.

ఈ అడ్డదారి ద్వారా ఖాన్ చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీని 50 శాతం వరకు తప్పించుకునేవాడని అధికారుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. ఇలా అమెరికా, జపాన్ వయా దుబాయ్, శ్రీలంక మార్గంలో దాదాపు 30 ఖరీదైన లగ్జరీ కార్లను ఖాన్ ఇండియాలో విక్రయించాడు. కార్ లాంజ్ ప్రధానంగా హమ్మర్ ఈవీ, క్యాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ఖరీదైన మోడళ్లను పన్ను ఎగవేతతో ఇండియాలో విక్రయించాడని గుర్తించారు అధికారులు.

►ALSO READ | హైదరాబాద్​: జోరుగా నకిలీ సర్టిఫికెట్ల దందా.. ఆరుగురు అరెస్ట్​

హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తు్న్న ఖాన్ దాదాపు 10 ఏళ్ల నుంచి షోరూమ్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఎనిమిది వాహనాల దిగుమతితో ప్రభుత్వానికి రూ.7 కోట్ల వరకు కస్టమ్స్ సుంకం ఎగవేసినట్లు తేలింది. అయితే ఖాన్ దిగుమతి చేసిన కార్లను తన ఫార్మ్ హౌస్ లో దాచేందుకు డాక్టర్ అహమద్ అనే బిజినెస్ పార్ట్నర్ సహాయం చేసేవాడని అధికారులు తేల్చారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఖాన్ కొందరు రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను అండగా వాడుకున్నాడని తెలుస్తోంది. పైగా పన్ను అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకు చాలా మంది కస్టమర్ల నుంచి డబ్బు రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేసినట్లు తేలింది. ఖాన్ వ్యాపారం కేవలం హైదరాబాదుకు పరిమితం కాలేదని ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీల్లో విస్తరించిందని గుర్తించబడింది.