కరీంనగర్: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ దగ్గర కారు బోల్తా పడింది. ఇద్దరికి గాయాలయ్యాయి. రాజీవ్ రహదారిపై కారు బోల్తా పడి పల్టీలు కొట్టడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన మ్యాదరి రాజు(40) తన తల్లి మరియమ్మను (65) హైదరాబాద్‌లో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మ్యాదరి రాజు, ఆయన తల్లి మరియమ్మకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో ఆదివారం మరో రోడ్డు ప్రమాదం కూడా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో యూటర్న్ దగ్గర హైదరాబాద్ నుంచి చేవెళ్ల వస్తున్న మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న బ్రీజా TG 09 C 8589 అనే కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో జరిగిన సమయంలో కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు.
►ALSO READ | భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన L&T ఆఫీస్
ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక చేవెళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న క్షతగాత్రులను అంబులెన్స్లో చేవెళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించేశారు.
