ఆగస్ట్ లోనూ కార్ల అమ్మకాలు 5 శాతం తగ్గాయి.. 8 లక్షలకు చేరిన అమ్ముడుపోని వాహనాలు

ఆగస్ట్ లోనూ కార్ల అమ్మకాలు 5 శాతం తగ్గాయి.. 8 లక్షలకు చేరిన అమ్ముడుపోని వాహనాలు

కార్ల కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. 2024, ఆగస్ట్ నెలలో 5 శాతం తగ్గాయి అమ్మకాలు. పండుగ సీజన్ మొదలైనా.. ఆఫర్స్ ప్రకటిస్తున్నా.. అమ్మకాలు పుంజుకోకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA).

2023 ఆగస్ట్ నెలలో.. 3 లక్షల 23 వేల 720 కార్లు అమ్మితే.. 2024, ఆగస్ట్ నెలలో కేవలం 3 లక్షల 9 వేల కార్లను మాత్రమే అమ్మాయి కంపెనీలు. దీంతో అమ్ముడుపోని కొత్త కార్ల సంఖ్య ఏకంగా 8 లక్షలకు చేరిందని వెల్లడించారు FADA అధ్యక్షులు మనీష్ రాజ్ సింఘానియా. 2023 జూలై నెలతో పోల్చుకుంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని వెల్లడించారాయన. దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీల డీలర్స్ దగ్గర కొత్త కార్లు పేరుకుపోతున్నాయని.. వాటి 8 లక్షలుగా ఉంటే.. వీటిని అమ్మటానికి కనీసం 75 రోజులు పడుతుందని.. అది కూడా మార్కెట్ బాగుంటేనే అని వివరించారాయన.

Also Read :- జాతకాలు చూసి ఉద్యోగం ఇస్తున్న కంపెనీ 

డీలర్స్ దగ్గర ఉన్న అమ్ముడుపోని కొత్త కార్ల విలువ 77 వేల 800 కోట్ల రూపాయలుగా ఉందని.. వినాయచవితి పండుగ సీజన్ మొదలయ్యి 15 రోజులు అవుతున్నా.. ఆఫర్స్ ప్రకటించినా.. కొనుగోళ్లు పుంజుకోలేదని స్పష్టం చేశారు సింఘానియా. 

కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోవటానికి వర్షాలు ఒక్కటే కారణం కాదని.. జనంలో ఉత్సాహం లేదనే భావన వ్యక్తం చేశారాయన.

వ్యక్తిగత కార్ల అమ్మకాల సేల్స్ 5 శాతం తగ్గితే.. కమర్షియల్ వాహనాల అమ్మకాలు సైతం 6 శాతం తగ్గాయి. ట్రాక్టర్ అమ్మకాలు ఏకంగా 11 శాతం తగ్గాయి. ఇదే సమయంలో టూవీలర్.. బైక్ సేల్స్ మాత్రం 6 శాతం పెరిగాయి. త్రీ వీలర్ సేల్స్ 2 శాతం పెరిగాయి.

మొత్తంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సంక్షోభం వచ్చినట్లు కనిపిస్తుంది. కార్ల అమ్మకాలు ప్రతి నెలా తగ్గిపోతుండటంతో.. కొత్త కార్ల తయారీని నిలిపివేయాలని డీలర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఉన్న కార్లను పూర్తిగా అమ్మిన తర్వాతే.. కొత్త కార్ల తయారీ ప్రారంభించాలని కోరుతున్నారు డీలర్స్.

మరిన్ని వార్తలు