- నవంబర్‌లో 19.71 శాతం పెరిగిన ఫోర్ వీలర్ సేల్స్
న్యూఢిల్లీ: దసరా, దీపావళి వంటి కీలకమైన పండుగలు అయిపోయినా, కార్ల అమ్మకాల్లో ఊపు తగ్గడం లేదు. ఈ ఏడాది నవంబర్‌లో కార్ల సేల్స్ ఏడాది లెక్కన 19.71 శాతం పెరిగాయి. జీఎస్‌టీ రేట్లు తగ్గడంతో బండ్ల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, టూవీలర్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ప్రభుత్వ పోర్టల్ వాహన్ డేటా ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో టూ వీలర్ బండ్ల అమ్మకాలు ఏడాది లెక్కన 3.10శాతం తగ్గి 25,46,184 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఇదే టైమ్‌లో త్రీవీలర్ సేల్స్ 23.67శాతం పెరిగి 1,33,951 యూనిట్లకు, ఫోర్ వీలర్ సేల్స్ 19.71శాతం పెరిగి 3,94,152 యూనిట్లకు ఎగిశాయి.
ట్రాక్టర్ల అమ్మకాలు 56.55 శాతం పెరిగి 1,26,033 యూనిట్లకు చేరగా, కమర్షియల్ వాహనాలు అమ్మకాలు 19.94 శాతం పెరిగి 94,935 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది నవంబర్‌లో బండ్ల అమ్మకాలు 2.14శాతం పెరిగి 33,00,832 యూనిట్లకు చేరాయి. ‘‘సాధారణంగా ఫెస్టివల్ సీజన్ తర్వాత బండ్ల అమ్మకాలు నెమ్మదిస్తాయి. కానీ, ఈ ఏడాది నవంబర్‌లో అలాంటి పరిస్థితి కనిపించలేదు. మార్కెట్ బలంగా ఉంది. జీఎస్‌టీ రేటు కోతలు, కంపెనీల ఆఫర్లు, ఎస్‌యూవీల డిమాండ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు వంటివి అమకాల వృద్ధికి దోహదపడ్డాయి”అని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ అన్నారు.
