స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఐక్యరాజ్యసమితి ఈకాప్25 పర్యావరణ సదస్సు ఇటీవల ముగిసింది. ఇందులో ప్రధానంగా ఇండియా ఏండ్ల తరబడి పోగు చేసుకున్న తన కార్బన్ క్రెడిట్స్ ను అమ్ముకోవడంపైనే ఫోకస్ పెట్టింది. కానీ.. కార్బన్ ట్రేడింగ్ పై ఎలాంటి రూల్స్ ఖరారు కాకుండానే చర్చలు ముగిసిపోయాయి. దీంతో ఇండియా వద్ద ఉన్న వందల కోట్ల కార్బన క్రెడిట్లను వేస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది.
2005లోనే షురూ
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు చర్యలు తీసుకుంటేనే గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలను తగ్గించడం సాధ్యమవుతుంది. అప్పుడే గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల సమస్యల నుంచి మనకు ముప్పు తగ్గుతుంది. కానీ ఎవరి అవసరాలు వాళ్లకుంటాయి కదా. ఇప్పటికే డెవలప్ అయిన దేశాలు బాగా ఖర్చు పెట్టి, కొత్త టెక్నాలజీలతో కార్బన్ ఎమిషన్స్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకోగలవు. కానీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న పేద దేశాల మాటేమిటి? అవి ఎక్కువగా ఖర్చు పెట్టలేవు కాబట్టి.. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే… కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించడాన్ని ప్రోత్సహించడం కోసం తెరపైకి వచ్చిన ఒక పథకమే కార్బన్ ట్రేడింగ్ స్కీం. దీనిని 2005లో అమలులోకి వచ్చిన క్యోటో ప్రోటోకాల్ లో భాగంగా ప్రవేశపెట్టారు. అయితే, క్యోటో ప్రోటోకాల్ లో భాగంగా ఇచ్చిన కార్బన్ క్రెడిట్స్ ను 2016 ఏడాదిలో అమలులోకి వచ్చిన పారిస్ ప్రోటోకాల్లో చేర్చేందుకు రూల్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇటీవల జరిగిన కాప్ 25 సమావేశంలోనూ క్రెడిట్స్పై ఏమీ తేల్చకుండానే చర్చలు ముగిశాయి.
ఒక్కో కార్బన్ క్రెడిట్ విలువ రూ. 2 వేల పైనే
క్యోటో ప్రోటోకాల్ పీరియడ్ నుంచీ ఇండియా గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలను తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టింది. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది. అడవుల పెంపకానికీ చర్యలు చేపట్టింది. అలాగే మనదేశంలోని కంపెనీలు కూడా ఎన్నో చర్యలు తీసుకున్నాయి. మొత్తంగా ఇన్నేండ్లలో మన దేశం వద్ద వందల కోట్ల కార్బన్ క్రెడిట్లు పోగు పడ్డాయి. ఒక్కో కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ కు అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2 వేలకు పైనే ఉంటుందని అంచనా. కానీ వీటిని అంతర్జాతీయ మార్కెట్లో కార్బన్ ట్రేడింగ్ ద్వారా అమ్ముకోవాలంటే ఇందుకోసం పారిస్ ఒప్పందంలో రూల్స్ ను సభ్యదేశాలు ఆమోదించాలి. కానీ రూల్స్ ఇంకా ఖరారు కాకపోవడం, అవుతాయో, లేదో తెలియకపోవడంతో ఇండియా, బ్రెజిల్ తో సహా చాలా దేశాలు అయోమయంలో పడ్డాయి.
కారణాలేమిటి?
గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలను తగ్గించేలా సభ్యదేశాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో క్యోటో ప్రోటోకాల్ లో కార్బన్ ట్రేడింగ్ కు అనుమతించారు. కానీ దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గడం లేదని, కొన్ని దేశాలు దీన్నీ ఒక వ్యాపార అవకాశంగా చూస్తున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్యోటో ప్రోటోకాల్ లో ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం, ఇప్పటివరకు ఉన్న కార్బన్ క్రెడిట్స్ ను అమ్ముకోవడానికి చాన్స్ ఇవ్వాల్సిందేనని ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఒప్పందాన్ని గౌరవించకపోతే, ఆ తర్వాత కుదిరిన పారిస్ ఒప్పందానికి అర్థమే లేదని అంటున్నాయి.
వచ్చే ఏడాదే తేలేది..
ఓవరాల్ కార్బన్ మార్కెట్ పై అగ్రిమెంట్ లేకపోవడం, చాలా దేశాల దగ్గర కార్బన్ క్రెడిట్స్ పోగు పడటమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అయితే, దీనిపై వచ్చే ఏడాది నవంబర్ లో స్కాట్లాండ్ లోని గ్లాస్గో సిటీలో జరిగే యూఎన్ఎఫ్సీసీసీ కాప్ 26 సదస్సులో తిరిగి చర్చలు జరగనున్నాయి. ఇండియా, ఇతర దేశాలు మళ్లీ ఆ సదస్సులో ఈ విషయాన్ని లేవనెత్తుతాయి. మొత్తానికి కార్బన్ ట్రేడింగ్ పై ఆ సదస్సులోనే ఒక క్లారిటీ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
