శ్రీశైలంలో పేకాట ఆడుతూ దొరికిన హోంగార్డులు

శ్రీశైలంలో పేకాట ఆడుతూ దొరికిన హోంగార్డులు

దేవాలయాలంటే.. ఎంతో నిష్టగా, నియమంగా ఉండే అత్యంత పవిత్రమైన స్థలం. జనాలు ఎంత పవిత్రంగా, భక్తితో ఉంటే.. అక్కడ దైవం నడయాడుతూ.. భక్తుల కొంగు బంగారమవుతాడని చెప్తుంటారు.  కాని ఇప్పుడు దేవాలయ సిబ్బంది.. అక్కడున్న అధికారులు మరీ బరి తెగిస్తున్నారు.  పేకాట, జూదం లాంటివి ఆడే వారిని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని చట్ట రీత్యా శిక్షించాల్సిన పోలీసులే శ్రీశైలం  దేవస్థానం సమీపంలో పేకాట ఆడటం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నంద్యాల జిల్లా ఎస్పీ  ఒక కానిస్టేబుల్.. ఐదుగరు హోంగార్డ్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

ఏదైనా చిన్న పొరపాటు చేసినా.. దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడోనని భయపడేవారు. ఎంత శుచీ శుభ్రంగా ఉండి నిష్టగా భక్తితో పూజలు చేసినా.. తెలిసీతెలియక చేసిన తప్పులను మన్నింపుమంటూ ఆ దైవానికి మొరపెట్టుకుంటుంటారు భక్తులు. కానీ.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అంతా కమర్షిల్ భక్తి అయిపోయింది. కొందరైతే.. ఏదో ఫార్మాలిటీకి మొక్కులు చెల్లించుకుంటూ.. దైవంతో బిజినెస్ డీలింగ్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక దేవాలయాలల్లో పని చేసే సిబ్బందికైతే ఇక దైవం అంటే కొంచెం కూడా భయం లేకుండా పోయింది. అందుకు నిదర్శనమే.. తిరుమల, శ్రీశైలం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనే భక్తులు, సిబ్బంది చేస్తున్న బరితెగింపు పనులు.

మొన్నటికి మొన్నా.. తిరుమల కొండపై సిగరెట్లు, మందు బాటిళ్లు, మాంసం.. కనిపించాయి. ఇది భక్తులతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం కూడా. ఇక.. ఇప్పుడు శ్రీశైలంలోనూ అపచారం జరిగింది. ఆలయానికి అతి దగ్గరలో ఉన్న విశ్రాంతి గదిలో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. అయితే.. అది ఆడుతుంది ఎవరో కాదు.. పోలీస్, ఆలయ సిబ్బందే. పేకాట బ్యాచ్‌లో పోలీస్ ప్రోటోకాల్ సిబ్బంది, VIP కార్ ఎంట్రెన్స్ వద్ద విధులు నిర్వర్తించే హోంగార్డ్ సిబ్బంది ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయ నిబంధనల ప్రకారం శ్రీశైలంలో జూదం నిషేధమని తెలిసినా.. ఆలయ సిబ్బందే ఇలా బరితెగించటం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిన పోలీస్, సిబ్బందే రూల్స్ అతిక్రమించి ఇలా ఆడటమేంటని దుయ్యబడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన నంద్యాల జిల్లా ఎస్పీ  పేకాట ఆడుతున్న పోలీసులను సస్పెండ్ చేశారు.