
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్, తొమ్మిదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రి క్వార్టర్స్‌లో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ 6–3, 6–3, 6–1తో 21వ సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సిట్సిపాస్ (గ్రీస్) 3–6, 7–6 (7/4), 6–2, 6–2తో మటియో అర్నాల్డీ (ఇటలీ)ని ఓడించి క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్‌తో పోటీకి రెడీ అయ్యాడు. మరోవైపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ 7–5, 6–7 (2/7), 2–6, 6–3, 6–0తో 22 ఏండ్ల లోరెంజో మెసుటి (ఇటలీ)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికంగా 369వ విజయంతో రోజర్ ఫెడరర్ రికార్డును నొవాక్ సమం చేశాడు. ఇక విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్ (పోలాండ్)6–0, 6–0తో పొటపోవా (రష్యా)ను చిత్తు చేసి క్వార్టర్స్ చేరగా.. మూడో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో కొకియరెటో (ఇటలీ)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్) 6–4, 6–2తో డొనిలోవిచ్ (సెర్బియా)పై నెగ్గి ముందంజ వేశారు. మెన్స్ డబుల్స్‌లో ఇండియా లెజెండ్ బోపన్న శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో రెండో సీడ్ బోపన్న (ఇండియా)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 7–5, 4–6, 6–4తో జోర్మన్–ఓర్నాల్డో (బ్రెజిల్)ను ఓడించి రెండో రౌండ్ చేరారు.