4 నుంచి 6 వారాల్లో కేసులు పెరగొచ్చు

4 నుంచి 6 వారాల్లో కేసులు పెరగొచ్చు

కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తెలంగాణ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలోనూ 4 నుంచి 6 వారాల్లో కేసుల సంఖ్య కొద్దిగా పెరిగే అవకాశముందని అన్నారు. 93శాతం మందిలో యాంటీబాడీస్ ఉండటం, హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున ఇంతకు ముందులా భారీ వేవ్స్ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14శాతంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలని అన్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 20 కేసులు మాత్రమే వస్తున్నాయని.. హైదరాబాద్లో 15 కేసులు నమోదవుతున్నాయని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రోజు రివ్యూ చేస్తున్నారని చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు యధావిధిగా చేసుకోవచ్చన్న ఆయన.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదని చెప్పారు. ప్రస్తుతం ఎక్స్ఈ వేరియెంట్ కేసులు ఢిల్లీ, మహారాష్ట్రల్లో మాత్రమే ఉన్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు.