నాంపల్లిలో దొంగ ఓట్లు వేసిన ముఠాపై కేసు

నాంపల్లిలో దొంగ ఓట్లు వేసిన ముఠాపై కేసు

మెహిదీపట్నం, వెలుగు :  పో లింగ్ రోజున నాంపల్లిలో దొంగ ఓట్లు వేసిన ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ వివరాలను శుక్రవారం సాయంత్రం సౌత్ అండ్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ నితికా పంత్, సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. గురువారం నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (తెలుగు మీడియం)లో  పోలింగ్ జరిగింది. 

పోలింగ్ స్టేషన్ 123లో  ఉదయం 11 గంటలకు స్థానికులు మహ్మద్ జాకీర్ (40), మహ్మద్ షాబుద్దీన్ (28), రితీశ్ గుప్తా (38,) ముగ్గురు కలిసి దొంగ ఓట్లను వేస్తుండగా పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు ముఠా సభ్యులను పట్టుకొన్నారు.  వారిని హబీబ్ నగర్ పోలీసులకు అప్పజెప్పారు. వీరు ఎంఐఎం పార్టీకి ఓట్లు వేస్తున్నట్లు డీసీపీ బాలాస్వామి తెలిపారు. వీరి వద్ద 67 డూప్లికేట్ ఓటర్స్ ఐడికార్డ్స్, రెండు కెమికల్ బాటిల్స్ (తిన్నర్), ఓటర్ లిస్ట్, యూజ్డ్ అండ్ అన్యుజుడు కాటన్, మినీ స్లిప్స్ ప్రింటింగ్ మిషన్,  2 పేపర్ రోల్స్, పది మినీ వ్యాస్లిన్ డబ్బాలు, కోల్గేట్ టూత్ పేస్టు లతో పాటు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాపై కేసు నమోదు చేశామన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు.. ఎన్ని దొంగ ఓట్లు వేశారనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.