
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వాయనాడ్ 2019 లోక్‌సభ ఎన్నికను సవాల్ చేస్తూ సరితా ఎస్ నాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రాహుల్ గాంధీ ఎన్నిక, కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సరితా ఎస్ నాయర్ 2019 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.
ఇదిలా ఉంటే కేరళ సోలార్ స్కామ్‌కు సంబంధించి రెండు క్రిమినల్ కేసుల్లో సరితా ఎస్ నాయర్ దోషిగా తేలారు. 2019లో వాయనాడ్, ఎర్నాకుళం లోక్‌సభ స్థానాల నుండి పోటీ చేయడానికి నాయర్ నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారులు వాటిని తిరస్కరించారు. చీటింగ్ కేసుల్లో ఆమె దోషిగా తేలడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అనర్హురాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు.