బీఆర్ఎస్​ ఎంపీ కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ లో కేసు

బీఆర్ఎస్​ ఎంపీ కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ లో కేసు

ఓ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్​ఎస్​ ఎంపీ కె.కేశవరావు కుమారులపై బంజారాహిల్స్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. 35 ఏళ్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న ఎన్​ఆర్​ఐ.. జి.జయమాల(72) 1983 లో షేక్​ పేట మండలం సర్వే నంబర్​403లో 939 గజాల స్థలాన్ని పి.సుదర్శన్​రెడ్డి అనే వ్యక్తితో కలిసి షేక్ అలీఖాన్​ అహ్మద్​ నుంచి కొన్నారు. 

కొన్నాళ్లకు స్థలాన్ని రెండు భాగాలు చేసుకోగా జయమాలకు 469 గజాల స్థలం వచ్చింది.  2013–14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవిలో సుమారు రూ.2 కోట్ల 13 లక్షల స్థలాన్ని అమ్మారని.. దానికి సంబంధించిన ట్యాక్స్​ కూడా చెల్లించలేదని అధికారులు పేర్కొంటూ.. 10 ఏళ్లుగా ట్యాక్స్​ చెల్లించకపోవడంతో రూ.1.44 కోట్ల ట్యాక్స్​ చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులు అమెరికాలో ఉన్న భూ యజమానికి వెళ్లాయి.

తిరిగొచ్చి చూస్తే షాక్..

నోటీసులు అందుకున్న జయమాల అమెరికా నుంచి హైదరాబాద్​కి తిరిగొచ్చి చూసే సరికి షాక్​కి గురైంది. ఆమె  కొన్న స్థలంలో ఎంపీ కేశవరావు కుటుంబం నివసిస్తున్నట్లు తేలింది. 2013లోనే కేశరరావు కుమారుడు విప్లవ్​కుమార్​ స్పెషల్​ పవర్​ ఆఫ్​ అటార్నీ హోల్డర్​ ను అంటూ తన సోదరుడు వెంకటేశ్వరరావుకు కేవలం రూ.3 లక్షలకు అమ్మినట్లు తేలింది.  సంబంధిత పత్రాలను జయమాల చూడగా అవి ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. 

ఈ వ్యవహారంపై ఆమె గతంలోనే బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్లో కంప్లేంట్​ చేశారు. తాజాగా అడిషనల్​ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్​ కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.