జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొందరు నాన్ లోకల్ లీడర్లపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో నాన్ లోకల్స్ కనిపిస్తే కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
రహమత్ నగర్, వెంగళ్ రావు నగర్ లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్ లకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా తిరుగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో మోడల్ ప్రవర్తనా నియమావళి (MCC)ని ఉల్లంఘించి నియోజకవర్గంలోకి ప్రవేశించినందుకు ఈ ముగ్గిరిపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు అధికారులు.
ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోగా, బీఆర్‌ఎస్ సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ మోదీ ప్రభ, హిందుత్వ అజెండానే విశ్వసిస్తున్నది. కాంగ్రెస్ రెండేండ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్లే 3 ప్రధానపార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.
