V6 News

బిగ్ బాస్ ఫేమ్,నటి అషురెడ్డిపై కేసు

బిగ్ బాస్ ఫేమ్,నటి అషురెడ్డిపై కేసు
  •     పెండ్లి చేసుకుంటానని మోసం చేసిందన్న బాధితుడు
  •     రూ.9.5 కోట్లు, బంగారం, స్థిరాస్తులు తీసుకున్నట్లు ఫిర్యాదు
  •     కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ ​సీసీఎస్ పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు: బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి అషురెడ్డి అలియాస్ వెంకట అశ్వినిరెడ్డి కొయ్యపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. పెండ్లి పేరుతో డబ్బు, బంగారం, స్థిరాస్తులు తీసుకొని మోసం చేసిందని హైదరాబాద్​లోని షేక్​పేట్ కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారన్నారు. ధర్మేంద్ర తండ్రి యెనుముల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మేంద్ర లండన్​లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేస్తున్నారు. 2018లో స్వస్థలానికి వచ్చిన సమయంలో నటి అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. 

విదేశాల్లో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్​వచ్చానని చెప్పిన ఆమె.. కొద్ది రోజుల్లోనే ప్రేమ పేరుతో ఆయనకు దగ్గరైంది. పెండ్లి చేసుకుంటానని నమ్మించింది. అయితే, ధర్మేంద్ర తనకు ఇదివరకే పెండ్లి అయ్యిందని, ప్రస్తుతం తాము విడిగా ఉంటూ విడాకులకు అప్లై చేసుకున్నట్లు చెప్పారు. దీంతో, ఆమె తనకు గతం అవసరం లేదని, పెండ్లి చేసుకుంటానని చెప్పి.. వ్యక్తిగత అవసరాలు, కెరీర్ ఖర్చుల కోసమంటూ ధర్మేంద్ర నుంచి తరచూ డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. 

అషురెడ్డి మాటలు నమ్మిన ఆయన కోట్లు విలువ చేసే కారు, బంగారం, ప్లాట్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసి, ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. 2025 నాటికే అషురెడ్డి మొత్తం రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం, వాహనాలు, స్థిరాస్తులు అషురెడ్డి తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆమె కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని, పెండ్లి ఖాయం చేస్తున్నామంటూ 2024లో జ్యోతిష్యుడు వేణుస్వామితో జాతకాలను చూపెట్టారు. చివరకు వివాహానికి నిరాకరించారు. అషురెడ్డి సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆరోపణలన్నీ అవాస్తవం: అషురెడ్డి

‘నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. వాటిలో ఎలాంటి నిజం లేదు. నా అనుమతి లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా. ఇతరుల వ్యక్తిగత జీవితాలను గౌరవించడం నేర్చుకోవాలి.’ అంటూ అషురెడ్డి ఇన్‌‌‌‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు.