మంత్రి మల్లారెడ్డి మా భూములను లాక్కున్నడు .. బాధిత గిరిజనుల ఆందోళన

మంత్రి మల్లారెడ్డి మా భూములను లాక్కున్నడు .. బాధిత గిరిజనుల ఆందోళన

శామీర్ పేట,వెలుగు :  మంత్రి మల్లారెడ్డి తమ భూములను దౌర్జన్యంగా లాక్కున్నాడని బాధిత గిరిజనులు ఆరోపించారు. సుమారు రూ.150  కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకొని తమ బతుకులను ఆగం చేశారని మండిపడ్డారు. మంగళవారం తోట గేట్ వద్ద బాధిత గిరిజనులు ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామ సర్వే నంబర్ 33, 34, 35లో సుమారు 47 ఎకరాల18 గుంటల భూమిని మంత్రితో పాటు కొంత మంది బీఆర్ఎస్ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.

గంగారాం అనే గిరిజనుడు దాదాపు 50 ఏళ్ల క్రితం భూమిని సాగు చేస్తుండేవారని, అతనికి 10  మంది కొడుకులు ఉండగా, అందులో 9 మంది మరణించారని, ఇంకొక కొడుకు భిక్షపతి బతికి ఉన్నారని చెప్పారు.  కొన్ని కారణాలతో తామంతా బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డామని తెలిపారు.  ఇటీవల భిక్షపతికి మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు ఇప్పిస్తామని నమ్మించి 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

భిక్షపతికి కేవలం రూ. 2 లక్షల రూపాయలు ఇచ్చి మళ్లీ కలుస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.    డబ్బులు ఇవ్వకుండా గిరిజనులను మంత్రి మోసం చేస్తున్నారని, తమకు ఇస్తానన్న డబ్బులు  ఇప్పించాలని లేదంటే మల్లారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని గిరిజనులు హెచ్చరించారు.