డీ మార్ట్ కంప్లయింట్.. ఇన్స్టా రీల్స్ హనుమాన్ అరెస్ట్

డీ మార్ట్ కంప్లయింట్.. ఇన్స్టా రీల్స్ హనుమాన్ అరెస్ట్

ఓవరాక్షన్ ఎక్కువైంది.. ఈ సోషల్ మీడియా వచ్చినాక.. ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది రీల్స్ చేయటం.. సోషల్ మీడియాలో పడేయటం కామన్ అయిపోయింది.. నిబంధనలు ఏంటీ అనేది కూడా తెలియకుండా అడ్డంగా కేసులకు బుక్ అవుతున్నారు ఇన్ స్టా రీల్స్ కుర్రోళ్లు.. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.

 ప్రముఖ డీమార్ట్ షోరూంలో.. దొంగతనంగా చాక్లెట్లు ఎలా తినాలి.. వాటికి బిల్లు ఎలా ఎగ్గొట్టాలి అంటూ.. ఆ డీమార్ట్ షోరూంలోనే రీల్ చేసి తన అకౌంట్ లో పోస్ట్ చేశాడు హనుమాన్ నాయక్. ఇది కాస్తా వైరల్ అయ్యింది. ఇలాగే వదిలేస్తే డీమార్ట్ కు వచ్చే అందరూ చాక్లెట్లు తిని.. డబ్బులు ఎగ్గొట్టి పోతారని భయపడిన డీమార్ట్ యాజమాన్యం పోలీస్ కేసు పెట్టింది.. ఈ వివరాల్లోకి వెళితే...

22 ఏళ్ల హనుమాన్ నాయక్‌ ఇటీవల తన స్నేహితులతో కలిసి షేక్‌పేటలో ఉన్న  డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్లాడు. అక్కడ అమ్మడానికి పెట్టిన చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా ఎలా తినాలో చూపించి ఫేమ్ అవ్వాలనుకున్నాడు.  అందులో భాగంగా ముందుగా ఓ రెండు చాక్లెట్లను తీసుకొని, ఓ షర్ట్ తోట్రయిల్ రూమ్ లోకి వెళ్లాడు. ఆ రూమ్ లో చాక్లెట్ల్ తినేసి.. చాక్లెట్ల్ కవర్ ను షర్ట్ లో పెట్టేసి తిరిగి షర్ట్  ను  ఎక్కడినుండి తీసుకువచ్చాడో అక్కడే పెట్టేశాడు.

 ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాల్లో పోస్టు చేయడంతో వీడియో బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్‌ షేక్‌పేట బ్రాంచ్‌ మేనేజర్‌ అర్జున్‌సింగ్‌ బుధవారం ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను దొంగిలించిన హనుమంత్‌ నాయక్‌తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్‌ కింద  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.