మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై కేసు నమోదు

మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై కేసు నమోదు

బషీర్ బాగ్, వెలుగు:  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 10 మంది ప్రభుత్వ అధికారులను నిందితులుగా చేరుస్తూ మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్  రిజిస్టర్  చేశారు. ఎన్నికల అఫిడవిట్​ను టాంపరింగ్ చేశారంటూ మహబూబ్​నగర్ కు చెందిన రాఘవేందర్ రాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గతంలో పిటిషన్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. మంత్రి శ్రీనివాస్​గౌడ్ తో అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్  రాజీవ్ కుమార్ , అప్పటి స్టేట్​ చీఫ్​ ఎలక్షన్​ ఆఫీసర్​ శశాంక్ గోయల్ , అప్పటి మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎన్నికల కమిషన్​కు చెందిన అధికారులతోపాటు మొత్తం 10 మంది అధికారులపై కేసులు నమోదు చేయాలని మహబూబ్​నగర్ టూటౌన్ పోలీసులను గత వారం ఆదేశించింది. 

అయితే..  కోర్టు ఆదేశించినప్పటికీ కేసు నమోదు చేయలేదని పిటిషనర్​ శుక్రవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు..  ఎన్నికల అఫిడవిట్​ టాంపరింగ్​ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. శుక్రవారం 4 గంటల్లోపు కేసు నమోదు చేశారో? లేదో? చెప్పాలని పబ్లిక్​ ప్రాసిక్యూటర్​కు తేల్చిచెప్పింది. ఒకవేళ కేసు నమోదు చేస్తే ఎఫ్​ఐఆర్​ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులకు హెచ్చరించింది. 

కోర్టు హెచ్చరికలతో..

ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించడంతో మహబూబ్ నగర్  టూ టౌన్ పోలీసులు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది అధికారులపై శుక్రవారం సాయంత్రం  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.