- కొందరిని కరిచిందని ఘాతుకం
- ఆలస్యంగా వెలుగులోకి..ఇద్దరిపై కేసు నమోదు
జీడిమెట్ల, వెలుగు: వీధి కుక్కను హింసించి చంపి అనంతరం మంటల్లో కాల్చిన ఘటనలో ఇద్దరిపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లంపేట్ కేవీఆర్ వ్యాలీ ప్రాంతంలో ఓ వీధి కుక్క కొన్ని రోజుల క్రితం కొందరిని కరిచింది.
దీనితో ఆ ప్రాంతానికి చెందిన శ్రీశైలం, మనోజ్‌లు ఇతరులతో కలిసి ఈనెల 24న కుక్కను చంపేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు మహిళలు జంతుప్రేమికుడు సాయితేజ పెద్దినేనికి సమాచారం ఇచ్చారు. అతడు అక్కడికి చేరుకుని కుక్కను చంపవద్దని కోరినా వారు పట్టించుకోలేదు.
కొద్ది గంటలపాటు కుక్కను వెంబడించి పట్టుకుని కర్రలతో కొట్టి చంపి మంటల్లో కాల్చేశారు. దీనిపై సాయితేజ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
