నకిలీ పేపర్లతో ఇంటి స్థలాన్ని కాజేసిన..12 మందిపై కేసు

నకిలీ పేపర్లతో ఇంటి స్థలాన్ని కాజేసిన..12 మందిపై కేసు

కరీంనగర్ క్రైం, వెలుగు : నకిలీ పత్రాలతో ఇంటి స్థలాన్ని కాజేయడమే కాకుండా, కొనుగోలుదారులను బెదిరించిన ఘటనలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ సుధగోని మాధవి, ఆమె భర్త కృష్ణాగౌడ్‌‌‌‌తో పాటు మరో 10 మందిపై కేసు నమోదు అయింది. కరీంనగర్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ కాలనీకి చెందిన దొమ్మాటి యుగంధర్ 2020 మార్చిలో రేకుర్తిలోని సర్వే నంబర్‌‌‌‌ 16లో 711 గజాల స్థలాన్ని తన భార్య లలిత పేరిట కొన్నాడు. ఆ స్థలంలో ఓ షెడ్‌‌‌‌ వేసి మున్సిపల్‌‌‌‌ పర్మిషన్‌‌‌‌ కోసం అప్లై చేశాడు. 2021 మార్చి17న 18వ డివిజన్ కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణ గౌడ్‌‌‌‌తో పాటు అతడి అనుచరులు గుడి రమణారెడ్డి, మహ్మద్ ఫెరోజుర్‌‌‌‌ రహమాన్‌‌‌‌, కాంపెల్లి రామాంజనేయులు యుగంధర్‌‌‌‌ను పిలిచి రూ.2 లక్షలు ఇవ్వాలని లేదంటే షెడ్‌‌‌‌ను కూల్చివేస్తామని బెదిరించారు. 

యుగంధర్ స్పందించకపోవడంతో షెడ్‌‌‌‌ను ధ్వంసం చేశారు. దీంతో యుగంధర్‌‌‌‌ పుల్లూరి శ్రీపతిరావును వెంట తీసుకుని కృష్ణ గౌడ్ వద్దకు వెళ్లి రూ.1.50 లక్షలు ఇచ్చాడు. ఇంటి నంబర్‌‌‌‌ వచ్చిన తర్వాత బేస్‌‌‌‌మెంట్‌‌‌‌ కట్టేందుకు ప్రయత్నించగా కృష్ణాగౌడ్, అతడి మనిషి ఫిరోజ్‌‌‌‌ఖాన్‌‌‌‌ అడ్డుకున్నారు. ఆ స్థలం లక్ష్మీరాజం  అనే వ్యక్తిదని, స్థలాన్ని కొత్త  జైపాల్‌‌‌‌రెడ్డి అనే వ్యక్తి అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారని, ఆ స్థలం కావాలంటే గుంటకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని బెదిరించారు. దీంతో యుగంధర్‌‌‌‌ రూ. 7 లక్షలు, పక్క ప్లాట్‌‌‌‌ యజమాని గంగాధర్‌‌‌‌ రూ.2 లక్షలను కొత్త జైపాల్‌‌‌‌రెడ్డికి ఇచ్చారు. తర్వాత డాక్యుమెంట్లను పరిశీలించగా నకిలీ పట్టాగా తేలడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో బాధితుడు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్‌‌‌‌ ఆర్డర్ తెచ్చుకున్నాడు. 

దీంతో కృష్ణగౌడ్, జైపాల్‌‌‌‌రెడ్డి కలిసి ఇంటి నంబర్ రద్దు చేయించారు. దీంతో పాటు లక్ష్మీరాజంకు అనుకూలంగా రిపోర్టు ఇప్పించి, మొత్తం 14 ఇంటి నంబర్లు మంజూరు చేయించారు. అలాగే ఒకే రోజున 14 డాక్యుమెంట్లి రిజిస్టర్‌‌‌‌ చేయించారు. దీంతో యుగంధర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12మందిపై కేసు నమోదు చేశారు. ఫిరోజఖాన్‌‌‌‌, కాంపెల్లి రామాంజనేయులు, జంకే శ్రీకాంత్, కొత్తపల్లి రాజును బుధవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. రేవోజు లక్ష్మీరాజం, సుధగోని కృష్ణ గౌడ్, కొత్త జైపాల్ రెడ్డి, సుదగోని మాధవి, గుడి రమణారెడ్డి, గుర్రం రాజిరెడ్డి, రేవోజు పరిపూర్ణాచారి, రేవోజు రాఘవచారి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.