జూబ్లీహిల్స్, వెలుగు : అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం సెక్యూరిటీగా ఇచ్చిన బ్యాంక్ చెక్కులను దుర్వినియోగం చేస్తూ డబ్బు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇస్తా హోమ్స్ నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ జి.సందీప్ విజయేందర్ రెడ్డి(42) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2019–21 మధ్యకాలంలో వెంకటేశ్వరరావు, వనిజ, కవితతో ఇస్తా హోమ్స్ సంస్థ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
వారి అభ్యర్థన మేరకు సెక్యూరిటీగా తేదీ లేని నాలుగు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెక్కులను అందజేశారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రభుత్వ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందినప్పటికీ, చెక్కుల ద్వారా అక్రమంగా డబ్బు తీసుకోవాలని ముగ్గురు ప్రయత్నించారు. గత ఏడాది డిసెంబర్ 31న ఒక చెక్కును బ్యాంకులో సమర్పించగా అది రిజెక్ట్ అయింది. తిరస్కరించిన చెక్కులను పదే పదే బ్యాంకుల్లో వేసి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించగా పోలీసులు కేసు నమోదు చేశారు.
