బుజ్జగింపులు..బేరసారాలు.. ఫస్ట్ ఫేజ్ నామినేషన్ల విత్డ్రాకు రూ.లక్షల్లో ప్రలోభాలు

 బుజ్జగింపులు..బేరసారాలు..  ఫస్ట్ ఫేజ్ నామినేషన్ల విత్డ్రాకు రూ.లక్షల్లో ప్రలోభాలు
  • ఎంపీటీసీ ఎలక్షన్​లో సపోర్ట్ చేస్తామని భరోసా
  • ఎక్కడ చూసినా రాజీ చర్చలే 
  • అధిక నామినేషన్లు పడిన జీపీల్లో అయోమయం

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని బోధన్​ డివిజన్​లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమే లక్ష్యంగా నామినేషన్లు వేసిన వారిని ఆశావహులు బుజ్జగించడంతోపాటు బేరసారాలు ఆడుతున్నారు. సోమవారం స్క్రూట్నీ ముగియడంతో మిగిలిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోటీలో నిలిచినవారిని విత్​డ్రా చేయించేందుకు పైరవీలు షురూ చేశారు. నాలుగైదు నామినేషన్లు పడిన జీపీల్లో విత్​డ్రాకు రూ.లక్షల్లో నజరానా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

కుల సంఘాల పెద్దలను ఒప్పించి వారితో రాజీ కుదిర్చేందుకు మీటింగ్​లు పెడుతున్నారు. ఏకగ్రీవానికి ఫస్ట్ ప్రాధాన్యతనిస్తున్నారు. కుదరకపోతే ముఖాముఖి పోటీలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు పడిన పంచాయతీల్లో రాజీ కుదర్చడం ప్రధాన పార్టీల లీడర్లకు తలనొప్పిగా మారింది. 

ఎంపీటీసీ బరిలో నిలుపుతాం..

ఏకగ్రీవం కోసం నామినేషన్​ వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. సర్పంచ్​పోటీ నుంచి తప్పుకుంటే ఎంపీటీసీ ఎన్నికల్లో సపోర్టు చేస్తామని బేరసారాలు ఆడుతున్నారు.  బోధన్ డివిజన్​లో 184 గ్రామ పంచాయతీలు, 1,642 వార్డులకు ఫస్ట్ విడతలో ఈనెల 11న పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 27 నుంచి 29 వరకు విధించిన గడువులో సర్పంచ్ స్థానాలకు 1,156, వార్డులకు 3,526 నామినేషన్లు దాఖలయ్యాయి. 3వ తేదీ విత్​డ్రా గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు. బోధన్ మండలంలోని జనరల్​పంచాయతీలో సర్పంచ్ పోస్టుకు ఐదుగురు నామినేషన్లు వేశారు. నలుగురు విత్​డ్రా అయితే ఒక్కొక్కరికి రూ.5 లక్షల తోపాటు గ్రామాభివృద్ధికి రూ.31 లక్షల ఇస్తామంటూ ఒకరు ఆఫర్ ఇచ్చారు. 

ఒప్పందం కుదుర్చుకునేందుకు కుల పెద్దలతో సోమవారం మీటింగ్ నిర్వహించారు. బీసీ జనరల్​కు రిజర్వు చేసిన మరో పంచాయతీలో ఇద్దరిని విత్​డ్రా చేయించడానికి గ్రామ ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రెంజల్​ మండలంలో ఐదుగురిలో ముగ్గురిని విత్​డ్రా చేయించడానికి  మిగిలిన ఇద్దరు బేరాలు నడుపుతున్నారు.  ఎంపీటీసీ ఎలక్షన్​లో సపోర్టు చేస్తానని ఒకరు ఆఫర్​ ఇవ్వగా, మరొకరు క్యాష్​ ఇస్తామని ప్రలోభపెట్టారు. ముగ్గురు నామినేషన్లు వేసిన ఒక జీపీలో ఇద్దరి మధ్య విత్​డ్రా ఒప్పందానికి మండల నేతలు కసరత్తు చేస్తున్నారు.

 ముగ్గురు నామినేషన్లు వేసిన ఓ గిరిజన తండాలో పంచాయతీ ఎన్నికలు ఫ్యామిలీ చిచ్చురేపాయి. తన ఏకగ్రీవానికి మద్దతుగా విత్​డ్రా చేసుకోకుంటే బంధుత్వం తెగిపోయినట్లేనని బెదిరింపులకు పాల్పడ్డారు.  నవీపేటలోని గిరిజన తండాలో ఇద్దరి విత్​డ్రాకు రూ.4.5 లక్షలు, మరో జీపీలో రూ.9.5 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తాన్ని తండా అభివృద్ధికి ఖర్చు చేస్తామని, మంగళవారం కూర్చుని మాట్లాడుకుందామని ఒప్పందం చేసుకున్నారు. 

ఏం చేసేది ?

బీసీ జనరల్ రిజర్వ్ అయిన కోటగిరి  జీపీ సర్పంచ్ స్థానానికి అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. బీసీ జనరల్​కు కేటాయించిన ఎడపల్లి మండలం జాన్కంపేటలో 13, అదే సామాజిక వర్గానికి రిజర్వ్​ అయిన నెహ్రూనగర్ పంచాయతీలో 10 మంది పోటీలో ఉన్నారు. 72 గ్రామపంచాయతీల్లో పదికి మించి నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరూ వెనక్కు తగ్గకపోవడం ప్రధాన పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది.