జులైలో కులగణన.. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు

జులైలో కులగణన.. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు
  • ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్​లైన్స్ ఖరారు 
  • బీసీ, ప్రజా సంఘాలు, పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్​లైన్స్ ఖరారు చేయనున్నారు. అంతకంటే ముందు బీసీ, ప్రజాసంఘాలు, పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత  సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై గైడ్ లైన్స్ పై చర్చించనున్నట్టు తెలిసింది. అన్ని అనుకున్నట్టు జరిగితే జులైలో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కులగణన కోసం అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఉన్నతాధికారులు అంటున్నారు. కులగణనకు తక్కువే టైమ్ పడుతుందని, అయితే అంతకుముందు చేయాల్సిన ప్రాసెస్ కే ఎక్కువ టైమ్ పడుతుందని పేర్కొంటున్నారు. 

అందరి అభిప్రాయాలతో ముందుకు..  

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కులగణన చేపట్టాల ని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై జీవో కూడా విడుదల చేసింది. రూ.150 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో కులగణన ప్రక్రియపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని, అంతకంటే ముందు బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు, పార్టీలు, మేధావులు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటామని చెబుతున్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. 

కానీ ఆ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను విడుదల చేయాలని బీసీ సంఘాలు, పార్టీలు కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అందరి సలహాలు, సూచనలు తీసుకుని అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కులగణన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.  

కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి..  

కులగణన తర్వాతే లోకల్ బాడీల ఎన్నిక లు నిర్వహించాలి. కులగణనతో రాష్ట్రంలో ఎన్ని కులాలున్నా యి? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? అనేది తెలుస్తుంది. ఇది అన్ని కులాలకు సంబంధించి ఎక్స్ రే లాంటిది.  జనగణన మాదిరిగానే కులగణన చేయాలి. దీనిపై ప్రభుత్వ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. 35 అంశాలను ఖరారు చేసిలో కులగణన చేపట్టాలి. ఇందుకోసం బీసీ కమిషన్ సాయం తీసుకోవాలి. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కులగణనపై మా సలహాలు, సూచనలు ఇస్తాం. 

– ఆర్ కృష్ణయ్య, ఎంపీ, 

లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల టర్మ్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఎంపీ ఎన్నికలు ఉండడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు జులైలో ఎంపీటీసీ, జడ్పీటీసీల టర్మ్ కూడా ముగియనుంది. తర్వాత మున్సిపాలిటీల టర్మ్ ముగియనుంది. అయితే కులగణన పూర్తయిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వంతో కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.  బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించారని, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.