కుల అహంకారానికి చిన్నారి బలి!..నాగర్కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతి వెనుక కులవివక్ష!

కుల అహంకారానికి చిన్నారి బలి!..నాగర్కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతి వెనుక కులవివక్ష!
  •     అగ్రకులస్తుల దాడిలో మృతిచెందిన రెండునెలల పసికందు
  •     పాపను వెంటతీసుకొని దైవ దర్శనానికి వెళ్లిన భార్యాభర్తలు
  •     ఆలయంలో అక్రమ వసూళ్లను ప్రశ్నించిన గణేశ్
  •     గదిలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడిచేసిన రెడ్డి కులస్తులు 
  •     భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్లిన అతని భార్య మౌనికను తోసేసిన నిందితులు
  •      రెండు నెలల చిన్నారి కిందపడి తీవ్ర అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి
  • బాధితులపైనే పోలీసుల కేసు.. విమర్శలు రావడంతో ఎట్టకేలకు ముగ్గురి రిమాండ్​.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నాగర్​కర్నూల్ జిల్లా కుమ్మెర శివాలయంలో కుల వివక్ష కారణంగా జరిగిన దాడిలో 2 నెలల చిన్నారి మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 18న నిరుపేద రజక, దళిత కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై రెడ్డి కులస్తులు చేసిన దాడిలో తల్లి చేతిలోంచి కిందపడిన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, పోలీసులు బాధితులపైనే కేసులు నమోదుచేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ, దళిత సంఘాల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు 8 మందిపై కేసులు పెట్టిన పోలీసులు.. సోమవారం ముగ్గురిని రిమాండ్​ చేశారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీ సంఘాలు డీజీపీకి విజ్ఞప్తి చేశాయి. ఈ అమానవీయ ఘటనపై బీసీ కమిషన్ స్పందించింది. చిన్నారి మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎండో మెంట్ కమిషనర్​కు బీసీ కమిషన్​ చైర్మన్​ నిరంజన్​ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ జరిగింది.. 

ఈ నెల 18న కుమ్మెర శివాలయంలో జాతర సందర్భంగా దైవదర్శనానికి వెళ్లిన భక్తుల నుంచి నిర్వాహకులు రూ.100 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపై గణేశ్, అతడి భార్య మౌనిక అభ్యంతరం తెలిపారు. గణేశ్​రజక కులస్తుడు కాగా, దళితురాలైన మౌనికను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆలయ నిర్వాహకులుగా ఉన్న రెడ్డి కులస్తులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కులం పేరుతో దూషించడంతో మాటామాట పెరిగింది. ఈ క్రమంలో  నిర్వాహకులు గణేశ్​ను కొబ్బరికాయలు అమ్మే గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. తన భర్తను కొట్టొదని అడ్డం వెళ్లిన భార్య మౌనికను, ఆమె అక్క చంద్రకళను తోసేశారు.ఈ క్రమంలో మౌనిక చేతిలో ఉన్న రెండు నెలల చిన్నారి కిందపడి తీవ్ర అస్వస్థతకు గురైంది. గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఘటన జరిగిన మర్నాడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. పైగా గణేశ్​తమపైనే దాడి చేశాడని నిర్వాహకులు వచ్చి ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. గణేశ్ శరీరంపై గాయాలు కనిపించలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని పోలీసులు సమర్థించుకున్నారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, తన కూతురు గాయపడి చనిపోతే వేరే కారణాలతో చనిపోయి ఉంటుందంటూ తనను బెదిరించారని బాలిక తల్లి మౌనిక కన్నీళ్లు పెట్టుకుంది. నిందితులు ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డి బంధువులని, అందుకే వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వచ్చాయి.

మిన్నంటిన ఆందోళనలు

 చిన్నారి  మరణించడంతో శనివారం రాత్రి డీఎస్పీ నేత విశారదన్​ మహారాజ్, బీఎస్పీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మెయిన్​ రోడ్డుపై అర్ధరాత్రి 12 గంటల వరకు చిన్నారి డెడ్​బాడీతో ధర్నా చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్​ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆదివారం కూడా రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీసీ ఇంటలెక్చువల్​ ఫోరం కన్వీనర్​ చిరంజీవులు బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అంబేద్కర్​ కూడలిలో సోమవారం ధర్నా నిర్వహించారు. సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ.. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. కలెక్టర్, ఎస్పీ ఇంకా గ్రామాన్ని ఎందుకు సందర్శించలేదని నిలదీశారు. సోమవారం ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి డీఎస్పీ ఆఫీసులో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లగా.. దీక్ష శిబిరం దగ్గరకు రావాలని ప్రజాసంఘాలు డిమాండ్​ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ముగ్గురు రిమాండ్..

గణేశ్​పై దాడి, చిన్నారి మృతి కేసులో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మధుసుదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సతీశ్ రెడ్డి, కటికే నగేశ్, కన్ని రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తుకారాం రెడ్డి పరారీలో ఉన్నారని చెప్పారు. చిన్నారి మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నామని, పోస్ట్​మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు. 

విషాదఘటనను రాజకీయం చేయొద్దు: 
ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ

కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన విషాదకరమని, దాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారిని కోల్పోయిన తల్లికి న్యాయం జరగాలని, దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవద్దన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 

రజక సంఘాల ఆగ్రహం

నెట్​వర్క్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులవివక్ష దాడి.. చిన్నారి మృతి ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. పలు జిల్లాల్లో ప్రజాసంఘాలు, రజక సంఘాలు నిరసన చేపట్టాయి. బాధితులకు న్యాయం చేయాలని, దాడికిపాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. 2 నెలల పసికందును చంపిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి ఉరిశిక్ష వేయాలని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రజక సంఘం పెండ్యాల మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం గోదావరిఖనిలోని చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దైవదర్శనం చేసుకోవడానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేసి.. ఆడబిడ్డ చేతిలో ఉన్న పసికందును కాలితో తన్ని చంపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.  కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక మహిళలతో కలిసి రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ నిరసన చేపట్టారు. కేశవపట్నంలో రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.