కులగణనలో మిస్సయినోళ్ల కోసం ఇవాళ్టి (ఫిబ్రవరి 16) నుంచి సర్వే

కులగణనలో మిస్సయినోళ్ల కోసం ఇవాళ్టి (ఫిబ్రవరి 16) నుంచి సర్వే
  • వివరాల నమోదుకు ఈ నెల 28 వరకు చాన్స్ 
  • మూడు పద్ధతుల్లో వివరాలు తీసుకునేందుకు ఏర్పాట్లు
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. ఈసారైనా సర్వేలో పాల్గొంటారా? లేదా? అని చర్చ
  • గత సర్వేలో పాల్గొనని వాళ్ల సంఖ్య 16 లక్షలు ఉండొచ్చని అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే మొదలుకానుంది. గతంలో సర్వేలో పాల్గొనని వాళ్లు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ సర్వే ఈ నెల 28 వరకు కొనసాగనుంది. మూడు విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్‌‌కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే చాన్స్ ఇచ్చింది. 040-–21111111 టోల్​ఫ్రీ నెంబర్​కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్​చేసి అడ్రస్ చెప్తే.. ఫోన్ చేసినోళ్ల ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. అలాగే ఈసారి ఆన్ లై‌‌న్‌‌లో ఫారాలు డౌన్‌‌లోడ్ చేసుకుని వివరాలు ఇచ్చే ఆప్షన్​కూడా ఉంది. seepcsurvey.cgg.gov.in వెబ్ సైట్​లో ఫారం డౌన్​లోడ్​చేసుకుని వివరాలు నింపి, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కాగా, ఈ సర్వేపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి రివ్యూ చేసి పలు సూచనలు చేశారు. 

మిగిలిపోయినోళ్లు 16 లక్షల మంది.. 

పోయినేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. మొత్తం 1.15 కోట్లకు పైగా కుటుంబాలను గుర్తించగా.. కోటి 12 లక్షల కుటుంబాలు వివరాలు ఇచ్చాయి. దీనికి సంబంధించిన రిపోర్టును ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో పెట్టింది. రాష్ట్ర జనాభాలో 96.9 శాతం మంది సర్వేలో పాల్గొనగా, మరో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదు. సర్వేలో పాల్గొనని 3.56 లక్షల కుటుంబాల్లో దాదాపు 16 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకెవరైనా మిగిలిపోయినా వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశం కల్పించింది. కాగా, మార్చి మొదటి వారంలో కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వివరాల నమోదుకు మరోసారి అవకాశం కల్పించింది. 

బీఆర్ఎస్ పెద్దలు పాల్గొంటారా?  

గతంలో నిర్వహించిన కులగణన సర్వేలో బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు పాల్గొనలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్​రెడ్డి బయటపెట్టారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌‌, కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్​రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి తదితరులు ఎన్యూమరేటర్లకు తమ వివరాలు ఇవ్వలేదు. మరి వీళ్లు ఇప్పుడు నిర్వహించే సర్వేలోనైనా పాల్గొంటారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి గత సర్వేలోనే తమ వివరాలు నమోదు చేసుకున్నారు. 

కాల్​సెంటర్ ఆపరేటర్లకు శిక్షణ.. 

సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్స్ వచ్చినప్పుడు ఏమేం వివరాలు తీసుకోవాలనే దానిపై కాల్ సెంటర్ ఆపరేటర్లకు శనివారం హైదరాబాద్ కొంపల్లిలోని ఈఎంఆర్ఐ సెంటర్ లో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ అవగాహన కల్పించారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే కాల్స్​స్వీకరించి, ఆ వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించాలని సూచించారు. ‘‘కాల్ చేసిన వ్యక్తి పూర్తి వివరాలు తీసుకోవాలి. ముందుగా ఫోన్ నెంబర్ అడగాలి. ఆ మొబైల్ నెంబర్ తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్ లో నమోదయ్యారా? లేదా? చెక్​చేయాలి. ఒకవేళ కాకపోతే అతని పేరు, అడ్రస్, పిన్ కోడ్ నెంబర్, జీహెచ్ఎంసీ/ఇతర జిల్లాలు అనే వివరాలు తెలుసుకోవాలి. జీహెచ్ఎంసీ పరిధి కాకపోతే గ్రామం, మండలం, జిల్లా, మున్సిపాలిటీ కేంద్రమైతే వార్డ్ నెంబర్, ఏరియా అడగాలి. ఆ డేటాను సంబంధిత కలెక్టర్ కు పంపించాలి. అనంతరం ఎన్యూమరేటర్లు ఆయా ఇండ్లకు వెళ్లి సర్వే చేస్తారు” అని వివరించారు. గతంలో కులగణన సర్వేలో పాల్గొనని వారు మాత్రమే ఇప్పుడు వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.