కోపిష్టి పిల్లి చచ్చిపోయింది

కోపిష్టి పిల్లి చచ్చిపోయింది

కోపిష్టి పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిపోతే కూడా వార్త అవుతుందా అనొచ్చు. ఈ పిల్లి విషయంలో మాత్రం అది వార్తే. ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు మరి. దాని మొహం చూశారుగా. గుడ్లు మిటకరించి కోపంగా చూస్తూ బెదిరించినట్టు లేదూ. దాని మీద కార్టూన్లు, మీమ్స్​, బుక్కులు, మూవీ వచ్చాయంటే దాని ఫేస్​ ఎంత ఫేమస్సో అర్థం కావట్లేదూ. 2012లో తొలిసారిగా యూట్యూబ్​ వీడియోతో క్రేజ్​ సంపాదించిందీ పిల్లి. దీని అసలు పేరు టార్డర్​ సాస్​. హోటల్​లో వెయిట్రెస్​గా పనిచేస్తున్న తన ఓనరమ్మను కోటీశ్వరురాలిని చేసి పైసల కష్టాలను తీర్చింది. రూ.703 కోట్లు (10 కోట్ల డాలర్లు) సంపాదించిపెట్టింది. కొన్ని రోజులుగా ఇన్​ఫెక్షన్​తో బాధపడుతున్న టార్డర్​ సాస్​.. ఏడేళ్ల వయసులో చనిపోయింది. ఈ విషయాన్ని అమెరికా మోరిస్​టౌన్​లో ఉండే తన ఓనర్​ తబతా బుందీసెన్​ ఇన్​స్టాగ్రామ్​లో ఈ కోపిష్టి పిల్లి మరణవార్తను తెలిపింది.

మూత్రకోశ ఇన్​ఫెక్షన్​తో మే 14న చనిపోయినట్టు చెప్పింది. దీంతో దాని ఫ్యాన్స్​ చాలా బాధపడ్డారు. నెట్​లో దానికి నివాళులర్పించారు. కాగా, 2012లో తబతా సోదరుడు ఈ కోపిష్టి పిల్లి ఫొటోలు, వీడియోలను రెడిట్​లో పెట్టడంతో వైరల్​ అయింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్​లో పోస్ట్​ చేశారు. అప్పటి నుంచి దాని క్రేజ్​ అమాంతం పెరిగిపోయింది. దానిపేరు మీద 2013లో గ్రంపీ క్యాట్​: ఏ గ్రంపీ బుక్​ అనే పుస్తకం వచ్చింది. దానికి ఫాలోఅప్​గా వచ్చిన ద గ్రంపీ గైడ్​ టు లైఫ్​: అబ్జర్వేషన్స్​ బై గ్రంపీ క్యాట్​ అనే పుస్తకం బెస్ట్​సెల్లర్​ లిస్టులో మూడో స్థానాన్ని సంపాదించింది. 2014లో హాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. వరస్ట్​ క్రిస్మస్​ ఎవర్​ అనే సినిమాలో నటించింది. మరి, దానికి ఎందుకు ఆ రూపం వచ్చిందంటే.. మరుగుజ్జుతనం వల్ల. సరిగ్గా అభివృద్ధి కాని దవడలతో దానికి ఆ కోపిష్టి రూపం వచ్చిందని అక్కడి పశు వైద్యులు చెబుతున్నారు.