ఏపీలో దారుణం...యువకుడిని చావబాది..నోట్లో మూత్రం పోశారు

ఏపీలో దారుణం...యువకుడిని చావబాది..నోట్లో మూత్రం పోశారు

ఇటీవలే మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే  ఏపీలోని ఒంగోలులో అలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ వ్యక్తిని కొట్టి అతనిపై ఇద్దరు మూత్రం పోసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఐదు రోజుల క్రితం  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒంగోలులో మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి అనే ఇద్దరు స్నేహితులు దొంగతనాలకు పాల్పడుతుంటారు. వీరి మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలను పరిష్కరించుకుందామని.. రామాంజనేయులు జూన్ 19 న రాత్రి 9 గంటల సమయంలో నవీన్ ను  ఒంగోలు కిమ్స్  ఆసుపత్రి వెనకాలకు రప్పించాడు. అక్కడ ఇస్లాంపేట, ఒంగోలులోని గోపాల్ నగర్, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఎనిమిది మంది యువకులు ఉన్నారు. 

ఈ క్రమంలో అందరూ కలిసి ఫుల్ గా మద్యం సేవించారు. పార్టీ పీక్‌లో ఉన్న సమయంలో పాత విషయాలు మాట్లాడుకునే సందర్బంలో నవీన్, అంజి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో అంజి సహా తొమ్మిది మంది నవీన్‌పై క్రూరంగా దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు  నవీన్ పై  మూత్రం పోశారు.  

నవీన్‌కు తీవ్ర రక్తస్రావం అయ్యే వరకు తొమ్మిది మంది దాడి చేస్తూనే ఉన్నారు. నిందితులు తమ ప్రైవేటు భాగాలను నవీన్ నోటిలోకి చొప్పించేందుకు ప్రయత్నించారు. దాడి సంఘటనను నిందితులు  తమ సెల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. వారిలో ఒకరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు, మరో ఎనిమిది మంది నవీన్‌పై శారీరకంగా దాడి చేశారని, ఆ తర్వాత వారిలో ఇద్దరు అతనిపై మూత్ర విసర్జన చేశారని ఒంగోలు ఎస్పీ చెప్పారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.  ప్రధాన నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

నవీన్‌, రామాంజనేయులు చిన్ననాటి స్నేహితులని, వీరిపై ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో 50 చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.