ఇజ్రాయిల్ లో మరో జలియన్ వాలా బాగ్.. 260 మందిని నిలబెట్టి కాల్చేశారు

ఇజ్రాయిల్ లో మరో జలియన్ వాలా బాగ్.. 260 మందిని నిలబెట్టి కాల్చేశారు

జలియన్ వాలా బాగ్.. ఓ గ్రౌండ్ లో సమావేశం జరుగుతుండగా.. బ్రిటీష్ సైనికులు చుట్టుముట్టి.. తుపాకీలతో పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారు.. ప్రపంచ వ్యాప్తంగానే ఇప్పటికీ ఈ ఘటనను తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇలాంటి తరహా ఘటనే ఇప్పుడు ఇజ్రాయేల్ లో జరిగింది. సరిహద్దులు దాటి.. ఇజ్రాయిల్ లోకి వచ్చిన హమాస్ తీవ్రవాదులు.. ఓ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యూజికల్ ప్రోగ్రాంను టార్గెట్ చేశారు.

అవుట్‌డోర్ ట్రైబ్ ఆఫ్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ అనేది గాజా-ఇజ్రాయిల్ సరిహద్దుకు సమీపంలో ఓ గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ పార్టీ. ఇక్కడ వేలాది మంది యువకులు యూదుల సెలవుదినమైన సుక్కోట్‌ను జరుపుకుంటారు. కానీ అక్టోబర్ 8 తెల్లవారుజామున ఈ ఎడారి ప్రాంతంలో జరిగే పండుగపై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 260 మందిని చంపడం సంచలనం సృష్టించింది.

ఇజ్రాయిల్ రెస్క్యూ ఆర్గనైజేషన్, వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పలు వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి ప్రకారం, భయాందోళనకు గురైన రివెలర్లు కాల్పుల నుంచి పరిగెత్తి దాక్కోవడానికి ప్రయత్నించారు. సంగీత ఉత్సవం నుంచి దాదాపు 260 మృతదేహాలను తొలగించినట్లు ఇజ్రాయిల్ రెస్క్యూ సర్వీస్ జకా తెలిపారు. ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా.. మరో వైపు మృతుల పెరవచ్చని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరై తప్పిపోయిన వారిని గుర్తించేందుకు భద్రతా దళాలకు సహాయం చేస్తున్నామని ఫెస్టివల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపారు. సంగీత ఉత్సవంపై జరిగిన దాడిలో హమాస్ యోధులు పటిష్టమైన సరిహద్దు కంచెను పేల్చివేశారు.