
తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ పై సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ సిట్ భోలెబాబా డైరీని ప్రధాన సూత్రధారిగా తేల్చింది. పామాయిల్, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసి సరఫరా చేసినట్లు తేల్చింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై గురువారం ( జూన్ 5 ) హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారంటూ వాదించిన సీబీఐ... నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును కోరింది.
వైసీపీ హయాంలో టీటీడీకి సప్లై చేసిన నెయ్యిపై సుప్రీమ్ ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపిందని తెలిపింది సీబీఐ. భోలే బాబా డైరీకి పాలు సేకరించి నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని పేర్కొంది సీబీఐ. పామాయిల్, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని తెలిపింది సీబీఐ. టీటీడీ భోలెబాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను అడ్డం పెట్టుకొని ఘాతుకానికి పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపింది సీబీఐ. ఇందుకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ చాట్ కూడా సేకరించినట్లు కోర్టుకు తెలిపింది సీబీఐ.
ఈ కేసులో నిందితులు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ పై దాడి చేసి బెదిరించి ఢిల్లీకి పంపారని పేర్కొంది సీబీఐ. మరో నిందితుడు ఆశిష్ రోహిల్లా వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్దపడగా.. అతనికి తెలియకుండా అతని పేరు మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టేయాలని కోర్టును కోరింది సీబీఐ. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను జూన్ 17కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.