
న్యూఢిల్లీ: కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు అవినీతి కేసులో జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం100 మంది అధికారులు పలు నగరాల్లోని 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. రూ.2,200 కోట్ల కిరు పవర్ ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ మంజూరులో అవినీతి జరిగినట్టు కేసు నమోదైంది. మాలిక్‌తో సహా ఐదుగురిపై 2022 ఏప్రిల్‌లో సీబీఐ కేసు పెట్టింది. ఆ దర్యాప్తులో భాగంగా అధికారులు సోదాలు చేశారు. సత్యపాల్ మాలిక్ 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ.300 కోట్ల ఆఫర్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి హైడ్రో పవర్ ప్రాజెక్టుదని వెల్లడించారు. కాగా, జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 624 మెగావాట్ల సామర్థ్యంతో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.