ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నల వర్షం .. కవితను గంటన్నర పాటు విచారించిన సీబీఐ

ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నల వర్షం ..  కవితను గంటన్నర పాటు విచారించిన సీబీఐ

 

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. తొలిరోజు దాదాపు గంటన్నర పాటు విచారించింది. ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీసులో శనివారం ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. తొలుత కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. ఉదయం 10 గంటల తర్వాత ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, సహ నిందితులు, అప్రూవర్లుగా మారినోళ్లు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ పై ప్రశ్నించారు. అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి స్టేట్ మెంట్లతో పాటు అప్రూవర్లుగా మారిన ఎంపీ మాగుంట శ్రీనివాస్, ఆయన కుమారుడు రాఘవ, దినేశ్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాలపై ప్రశ్నించినట్టు తెలిసింది.  ప్రధానంగా బుచ్చిబాబు ఫోన్ లో దొరికిన వాట్సాప్ చాట్స్, ఢిల్లీ, హైదరాబాద్​లోని హోటల్స్​లో జరిగిన సమావేశాల ఫొటోలు, ఇతర ఆధారాలను ముందు పెట్టి విచారించినట్టు సమాచారం.  

కవిత పాత్రపై ఆరా..  

లిక్కర్ స్కామ్​లో కవిత పాత్ర ఏంటి అనే దానిపై సీబీఐ ఫోకస్ పెట్టింది. పాలసీ రూపకల్పనలో ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇందులోకి కవిత ఎంట్రీ ఎలా జరిగింది? కేజ్రీవాల్​ను కవిత నేరుగా కలిశారా? ఎవరి ఆదేశాల మేరకు గోవాకు డబ్బులు పంపారు? ఆప్ పార్టీ తరఫున అగ్ర నేతలు ఎవరు కీ రోల్ పోషించారు? అనే అంశాలపై ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. ‘కేజ్రీవాల్​ను కలిస్తే కవితను కలవాలని చెప్పారు’ అని మాగుంట శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్​మెంట్​పై ఆరా తీసినట్టు సమాచారం. లిక్కర్ పాలసీ రూపకల్పన కేజ్రీవాల్ డైరెక్షన్​లో జరిగితే, సౌత్ గ్రూప్ నుంచి కవిత కీ రోల్ పోషించినట్టు దర్యాప్తు సంస్థలు చార్జ్ షీట్​లో పేర్కొన్నాయి. వీళ్లిద్దరి మధ్య సమావేశాలు జరిగాయా? లింక్ ఎక్కడ ఉంది? అనే దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. 

ఇంటి నుంచి భోజనం.. 

సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, అడ్వొకేట్ మోహిత్ రావు, పీఏ శరత్ కలిశారు. ఈ సందర్భంగా కవితకు భర్త అనిల్ ధైర్యం చెప్పారు. అనంతరం సీబీఐ విచారణపై ఆరా తీశారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు కవితకు ఇంటి భోజనం అందించారు. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ.. లంచ్​లో పులిహోర,  వైట్ రైస్.. డిన్నర్​లో చపాతీ, ఆలూ టామాట కర్రీ ఆమె తీసుకున్నారు. మరోవైపు విచారణ తర్వాత ఖాళీ సమయంలో కవిత పుస్తకాలు చదువుతున్నారు. ఎలాన్ మస్క్, బరాక్ ఒబమా (ఆటో బయోగ్రఫీ) పుస్తకాలు కావాలని ఆమె కోరగా.. కుటుంబ సభ్యులు అందజేశారు.

నాకేం సంబంధం లేదు: కవిత 

ఈ కేసుతో తనకేం సంబంధం లేదని విచారణలో కవిత చెప్పినట్టు తెలిసింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు.. పలు విషయాలు మరిచిపోయానని, తనకు తెలియని వాటిపై ఎలా సమాధానం ఇవ్వగలనని ఆమె చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆమె ముందు పెట్టి విచారించినప్పటికీ, తనకేం సంబంధం లేదని కవిత చెప్పినట్టు తెలుస్తున్నది. తాను నిందితురాలిని కాదని, బాధితురాలినేనని ఆమె పేర్కొన్నారు.