కవితను విచారించనున్న  సీబీఐ

కవితను విచారించనున్న  సీబీఐ
  • పర్మిషన్​ ఇచ్చిన స్పెషల్ కోర్టు
  • వచ్చేవారం విచారించే చాన్స్​

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది. జైల్లోనే మహిళా కానిస్టేబుళ్ల సమక్షంలో ఆమెను విచారించాలని తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరి బవేజా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కింగ్ పిన్ అని, ఆమెను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. తమ కస్టడీకి అనుమతివ్వాలని కోరారు.

ఇప్పటికే ఈ కేసులో ఏడాది కింద కవితను విచారించామని, మరికొంత సమాచారం కోసం ఆమెకు నోటీసులు ఇచ్చామని పిటిషన్​లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, ఈ దశలో కవితను మరోసారి విచారిస్తే కీలక విషయాలు రాబట్టొచ్చని కోర్టుకు విన్నవించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌‌ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఎంక్వైరీ చేసే టైమ్​లో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. అలాగే, విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఆమె స్టేట్​మెంట్​ను రికార్డు చేయాలని సూచించింది. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 

సాక్షిగా కవితను ఏడాది కింద విచారించిన సీబీఐ

2022, జులైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ స్కామ్​లో ఆప్ లీడర్లతో పాటు సౌత్ గ్రూప్ పేరును ఢిల్లీ బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావించారు. సౌత్ గ్రూప్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే కీలకమని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2022, డిసెంబర్​లో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ స్కామ్​లో సాక్షిగా విచారించాల్సి ఉందని, సహకరించాలని కవితను సీబీఐ కోరింది. హైదరాబాద్ లేదంటే ఢిల్లీలో విచారించాలని భావిస్తున్నట్టు ఆమెకు సీబీఐ మెయిల్ పంపింది. కవిత రిక్వెస్ట్ మేరకు.. డిసెంబర్ 11న హైదరాబాద్​లోని ఆమె ఇంట్లోనే దాదాపు ఏడు గంటల పాటు సీబీఐ విచారించింది.

తర్వాత సీఆర్పీసీ 91 కింద ఈ కేసుకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే సమర్పించాలని కోరింది. సైలెంట్​గా దర్యాప్తు కొనసాగించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు రావాలని కవితకు సమన్లు పంపింది. ఇదే కేసు విచారణపై సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్ పెండింగ్​లో ఉందని, విచారణకు రాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఇదిలా ఉండగానే ఈడీ కూడా కవితను నిందితురాలి కింద విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది.

వీటిని కూడా కవిత తిరస్కరించారు. మార్చి 15న కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు ముందు విచారణకు వచ్చిన రోజు మధ్యాహ్నమే.. హైదరాబాద్​లోని ఆమె నివాసంలో ఈడీ సోదాలు చేసింది. చివరికి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరపర్చగా.. ధర్మాసనం రెండు దశల్లో మొత్తం 10 రోజుల కస్టడీ విధించింది. తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు మార్చి 26వ తేదీన న్యాయ స్థానం ఏప్రిల్ 9 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు.

మధ్యంతర బెయిల్ పిటిషన్​పై ఉత్కంఠ

చిన్న కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై పలుమార్లు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కవిత తరఫు నుంచి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ గురువారమే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 8వ తేదీ ఉదయానికి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ టైమ్​లో కవితను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరడం.. కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడంతో బెయిల్ పిటిషన్​పై ఉత్కంఠ నెలకొన్నది. వచ్చే వారం కవితను విచారించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. దీంతో కోర్టుకు ఆమెకు మధ్యంతర బెయిల్ ఇస్తుందా? లేక పిటిషన్​ను తిరస్కరిస్తుందా? అన్న చర్చ మొదలైంది. ఒకవేళ కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. సీబీఐ ఆమెను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.