
- ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరుకావాలని సమన్లు
- ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సీబీఐ
- సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్లు ఈడీ విచారణకు కవిత గైర్హాజరు
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26 న తమ ఎదుట హాజరుకావాలని ఫ్రెష్ గా సమన్లు పంపింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ లోని ఆమె ఇంటి అడ్రస్ కు ఈ నోటీసులు అందినట్లు సమాచారం. మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులు పంపినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఏ సెక్షన్ కింద కవితకు సీబీఐ నోటీసులు పంపిందనేది తెలియాల్సి ఉంది. కాగా 2022 జులై తర్వాత లిక్కర్ స్కాం వెలుగులోకి రాగా.. దాదాపు ఐదు నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్ లో తొలిసారి సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది.
దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ సమన్లు ఇచ్చింది. అయితే సీబీఐ, ఈడీ ఈ స్కాంను దర్యాప్తు చేస్తుండగా.. 2022, డిసెంబర్ 11న తొలిసారి సీబీఐ కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించింది. సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షిగా సుమారు ఏడు గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తర్వాత సీఆర్పీసీ 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది.
నాలుగు నెలల తర్వాత ఈడీ ఎంట్రీ..
సీబీఐ నోటీసులిచ్చిన 4 నెలల తర్వాత గతేడాది మార్చి మొదటి వారంలో ఈ కేసుకు సంబంధించి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో భాగంగా మార్చి 11న ఫస్ట్ టైం కవిత ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీ అబ్దుల్ కలాం రోడ్ లోని ప్రవర్తన్ భవన్లో (ఈడీ హెడ్ ఆఫీస్) తొలిరోజు విచారించిన అధికారులు 16న హాజరుకావాలని నోటీసులిచ్చారు. అయితే దర్యాప్తు సంస్థలు తనను ఇంటి వద్దే విచారించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రానుందన్న సాకుతో 16న విచారణకు రాలేనని తెలిపారు.
కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోని ఈడీ.. 20న తమ ముందు హాజరుకావాలని సమన్లు పంపారు. 20న మరో 10 గంటల పాటు విచారించిన అధికారులు, 21న కూడా హాజరుకావాలని కవితకు సమాచారమిచ్చారు. ఇలా మూడు సార్లు ఈడీ ఎదుట కవిత హాజరయ్యారు. తాజాగా ఈ నెల 16న హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా.. సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఎంక్వైరీకి హాజరుకాలేనంటూ లేఖ రాసి డుమ్మా కొట్టారు.
సీబీఐ రాకతో కొత్త మలుపు..
మూడు సార్లు.. 28 గంటల పాటు విచారణకు హాజరైన కవిత నుంచి ఈడీ కేవలం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ), సెక్షన్ 50 కింద స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం, సౌత్ గ్రూపు ఏర్పాటు, సౌత్ గ్రూప్- ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులుగా ఇచ్చిన డబ్బులు, స్కాంలో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై కవిత ఇచ్చిన సమాధానాలతో రూపొందించిన పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నారు.
కవిత సమర్పించిన తన బ్యాంకు ఖాతాలు, వ్యాపార లావాదేవీల నివేదికలు,11 ఫోన్లను పరిశీలించారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ పేరుతో ఈడీ నోటీసులను కవిత పక్కన పెట్టగా.. ఇప్పుడు సీబీఐ రీఎంట్రీ ఇవ్వడంతో కొత్త మలుపు తిరిగింది. ఇటీవల సీబీఐ అధికారులు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నేతల సమాచారాన్ని సేకరించింది. దీని ఆధారంగా కవితకు తాజా నోటీసులు పంపినట్లు తెలిసింది.
ఈ నెల 28న కవిత పిటిషన్పై విచారణ
లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటివి) చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతు గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 27న కవిత కేసు విచారణ సమయంలో ఈ పిటిషన్ ను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. గత వారం ఈ పిటిషన్ల ను విచారించిన జస్టిస్ బెల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ద్విసభ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
అందరి సమస్య ఒకటేనని, ఈ పిటిషన్లను విచారించాలని కవిత తరఫు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ బెంచ్ కు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ త్రివేది స్పందిస్తూ.. ఎందుకు అన్ని కలిపి విచారించాలని ప్రశ్నించారు. అన్ని పిటిషన్లు దేనికి అది వేరని, ఒకే అంశానికి సంబంధించినవి ఎలా అవుతాయన్నారు. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని అన్నారు. తదుపరి విచారణను ఈ నెల 28న చేపడతామని స్పష్టం చేసింది.