జీఎస్టీ పేరుతో రూ.5లక్షలు వసూలు.. జీఎస్టీ ఆఫీస్​ ఉద్యోగులపై కేసు

జీఎస్టీ పేరుతో రూ.5లక్షలు వసూలు.. జీఎస్టీ ఆఫీస్​ ఉద్యోగులపై కేసు

హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ పేరుతో రూ.5 లక్షలు వసూలు చేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ లో పని చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ  ప్రకటన విడుదల చేసింది. బషీర్ బాగ్ లోని జీఎస్టీ భవన్ లోని ప్రిన్సిపల్ కమిషనరేట్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ లో సూపరింటెండెంట్, ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఇద్దరు అధికారులు ఒకరిని వేధించి రూ.5 లక్షలు వసూలు చేశారు. 

జీఎస్టీ పన్నులు విధిస్తామని బెదిరించడంతో పాటు బాధితుడి స్క్రాప్ దుకాణాన్ని  సీజ్ చేశారు. ఈ నెల 4న రూ.5 లక్షలు లంచం తీసుకున్నారు. మరో రూ.3 లక్షలు ఇస్తేనే దుకాణం తెరిచేందుకు అనుమతిస్తామని చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేసి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.