లిక్కర్​ స్కామ్..ఇయ్యాల కవితను ప్రశ్నించనున్న సీబీఐ

లిక్కర్​ స్కామ్..ఇయ్యాల కవితను ప్రశ్నించనున్న సీబీఐ
  • బంజారాహిల్స్​లోని ఆమె ఇంట్లోనే విచారణ
  • మహిళా అధికారుల సమక్షంలో స్టేట్‌మెంట్‌ రికార్డు
  • పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌‌‌లోని ఆమె ఇంట్లో స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే  160 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే ఆదివారం స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసేందుకు వస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ కవిత ఇంటికి చేరుకోనుంది.

మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఆమె అంగీకారంతో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నిందితులైన బోయిన్‌‌‌‌పల్లి అభిషేక్‌‌‌‌రావు, అరుణ్‌‌‌‌ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు అక్కడి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

కవితకు కొండగట్టు అర్చకుల ఆశీర్వచనం

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు ఆలయ అర్చకులు శనివారం వేద ఆశీర్వచనం అందజేశారు. బంజారాహిల్స్‌‌‌‌లోని ఆమె నివాసంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్‌‌‌‌.. యాదాద్రి, ధర్మపురి, వేములవాడ ఆలయాలను గొప్పగా అభివృద్ధి చేశారని, అలాగే కొండగట్టును కూడా అభివృద్ధి చేస్తారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌‌‌‌ అన్నారు.