ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం

ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీబీఐ విచారణలో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయేషా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ఇప్పటికే కోరారు. వారు అంగీకరించారు.

2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో అయేషా మీరా హత్యకు గురైంది. ఈ  సంఘటన జరిగిన 12 ఏళ్లు గడిచింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు… కాబట్టి శరీరం ఎముకలు దొరికే అవకాశముంటుంది. శరీరంపై బలమైన గాయాలుంటే ఎముకలపై స్పష్టంగా కనపడే అవకాశం ఉందని… ఎముకలు ఎక్కడైనా విరిగినా తెలిసే అవకాశముంటుందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు.

ఈ కేసులో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల కుమారులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా, అవి నిరూపణ కాలేదు. కేసుకు సంబంధం లేని సత్యంబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ల జైలు జీవితం తర్వాత సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆపై కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కొన్ని నెలల క్రితమే మృతదేహం అవశేషాలను బయటకు తీయాలని భావించినా, కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ నెల 20లోగా రీ పోస్ట్ మార్టమ్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.