- ఏటా మున్సిపాలిటీకి రూ.3.45 కోట్ల రాబడి
- కోర్టు వివాదంతో నిలిచిన వేలం ప్రక్రియ
- టెండర్ ముగిసినా ఆగని ఫీజుల వసూలు
- 50 వారాలుగా మున్సిపాలిటీకి జమకానీ సంత డబ్బులు?
వనపర్తి/పెబ్బేరు, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చే వారాంతపు సంతలలో ఒకటైన పెబ్బేరు సంత ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన సుమారు 16 ఎకరాల స్థలంలో ప్రతీ శనివారం జరిగే ఈ సంత ద్వారా మున్సిపాలిటీకి ఏటా రూ.3.45 కోట్ల ఆదాయం సమకూరేది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయానికి ప్రత్యామ్నాయ స్థలం చూపకపోవడంతో పూజారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ కొత్తగా వేలం నిర్వహించలేకపోయింది. దీంతో అధికారికంగా టెండర్లు లేకపోయినా, పాత కాంట్రాక్టర్లే క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పెబ్బేరులోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి 30.19 ఎకరాలుండగా అందులో 16 ఎకరాలలో గత కొన్నేళ్లుగా ప్రతిశనివారం వారాంతపు సంతను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ స్థలాన్ని సంత జరిపేందుకు మున్సిపాలిటీకి ఇస్తే అంతే విలువగల స్థలాన్ని మరోచోట చూపిస్తామని గతంలో నాటి మంత్రి నిరంజన్‌రెడ్డి హయాంలో సంత పరిరక్షణ సమితి చెప్పగా.. ఆలయ పరిరక్షణ కమిటీ అంగీకరించింది.
తహసీల్దారు పేరు మీద 12.20ఎకరాల స్థలాన్ని మార్పిడి చేశారు. ఎంతకూ స్థలం చూపకపోవడంతో వేణుగోపాలస్వామి ఆలయ పూజారులు కోర్టునాశ్రయించారు. దాంతో క్రయ విక్రయాలకు ఎలాంటి టెండరు నిర్వహించరాదని మున్సిపాలిటీ నిర్ణయించుకుంది. అయినా రెండేండ్లుగా కాంట్రాక్టర్లు సంతలో ఫీజు వసూలు చేస్తున్నా మున్సిపాలిటీకి జమచేయడంలేదు.
సంతలో వసూలు చేసిన ఫీజును కంట్రాక్టర్లు ఒక బ్యాంకులో జాయింట్అక్కౌంట్తీసి అందులో జమచేస్తున్నట్లుగా చెప్తున్నారు. కొన్ని నెలలుగా అలా జాయింట్అక్కౌంట్లోనూ జమచేయడంలేదని తెలిసింది. వసూలు చేసే ఫీజులో కొంత కంట్రాక్టర్లు తమ సొంతానికి వాడుకుంటున్నారని వారిలోనే కొందరు పేర్కొంటుండడం గమనార్హం. 44వ జాతీయ రహదారిని అనుకుని ఉన్న పెబ్బేరు పట్టణం రోజు రోజుకు విస్తరిస్తోంది. సంత ద్వారా ఆదాయం రాకపోవడంతో అభివృద్ధి మరుగున పడుతోంది.
వారానికి రూ.6.44లక్షలు
గతంలో టెండర్లు నిర్వహించగా వారానికి రూ.6.44లక్షల చొప్పున ఫీజు చెల్లించాలని నిర్ణయించారు. పెబ్బేరు మున్సిపాలిటీకి సమకూరే ఆదాయంలో వారాంతపు సంత ఫీజే అత్యధికం. ఈ ఫీజును పట్టణంలో అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారు. అలా ప్రతీ వారం కాంట్రాక్టర్లు మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు. తైబజారు, పశువులు, మేకలు గొర్లకు విడివిడిగా కాంట్రాక్టర్లు ఉన్నారు. అంతా కలిసి సంత రోజు వసూలు చేసిన ఫీజులో నుంచి రూ.6.44లక్షలు మున్సిపాలిటీకి చెల్లిస్తారు. ఫీజు కూడా నిర్ధారిత మొత్తం కాకుండా ఇష్టారీతిగా వసూలు చేస్తుండడంతో ఫీజు ఎక్కువ మొత్తమే వస్తోంది.
మున్సిపాలిటీకి ఇవ్వాల్సింది ఇవ్వగా ఎంత లేదన్నా వసూలైన దాంట్లో 50శాతం వరకు గిట్టుబాటవుతుందని తెలిసింది. పేరుకు ముగ్గురు కాంట్రాక్టర్లే.. ఒక్కో కాంట్రాక్టరు కింద సబ్‌కాంట్రాక్టర్లు మొత్తం కలిపి 311మంది వరకు ఉంటారు. కాగా, ఏడాదికి రూ.కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం దూప దీప నైవేద్యానికీ నోచుకోవడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు.
50వారాలుగా డబ్బులు కట్టడంలేదు
స్థలం విషయంతో మున్సిపాలిటీకేం సంబంధంలేదు. జోక్యం చేసుకోం. 50వారాలుగా కాంట్రాక్టర్లు డబ్బులు కట్టడం లేదు. టెక్స్ రశీదులు కూడా మేమివ్వలేదు. పెబ్బేరు వెల్ఫేరు పేరుమీద వారే రశీదు పుస్తకాల ద్వారా వసూలు చేస్తున్నారు. గతంలో వారిపై కేసు కూడా పెట్టాం. అది ఇల్లీగలే. - ఖాజా అరీఫుద్దీన్, కమిషనర్ పెబ్బేరు మున్సిపాలిటీ
గుడి పేరుమీద అక్కౌంట్లో వేస్తున్నాం..
ప్రతి వారం వసూలయ్యే తైబజారు ఫీజును వేణుగోపాలస్వామి గుడి పేరుమీద తీసిన అక్కౌంట్ లో జమచేస్తున్నాం. గతంలో మున్సిపాలిటీకి 53వారాలది కట్టాం. గత 50 వారాలుగా అక్కౌంట్ లోనే వేస్తున్నాం. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైనా పక్కగా వేస్తున్నాం. కొత్తగా ఎవరినీ చేర్చుకోవడం లేదు. సంత ఇప్పుడున్న స్థలం లోనే సాగాలన్న ఉద్దేశ్యంతోనే నడుపుతున్నాం. - గోనెల బాలస్వామి, కంట్రాక్ట్ భాగస్వామి
