సీబీఐ దూకుడు:ఒకే రోజు 19 రాష్ట్రాల్లో దాడులు

సీబీఐ దూకుడు:ఒకే రోజు 19 రాష్ట్రాల్లో దాడులు

సీబీఐ దూకుడు పెంచింది. మంగళవారం ఒక్క రోజే 19 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 110 చోట్ల దాడులు నిర్వహించింది. అవినీతి, వెపన్స్‌‌ స్మగ్లింగ్‌‌, బ్యాంకులను మోసం చేయడం వంటి కేసులకు సంబంధించి ఈ దాడులు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం 110 టీమ్‌‌లుగా విడిపోయిన సిబ్బంది ఏకకాలంలో మెరుపు దాడులకు ప్లాన్‌‌ చేశారు. బ్యాంకు మోసాలకు సంబంధించి ఈ నెల 2న సోదాలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 50 సిటీల్లో సెర్చ్‌‌ ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం అంతకు మించి తనిఖీలు చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్‌‌, రాయ్‌‌పూర్‌‌, మధురై, కోల్‌‌కోతా, రాంచీ, లక్నో, కాన్పూర్‌‌, లూథియానా, థానే, వల్సాద్‌‌, పుణె, జైపూర్‌‌, గోవా, గురుగ్రాం, చండీగఢ్‌‌, భోపాల్‌‌, సూరత్‌‌తోపాటు పలు పట్టణాల్లో దాడులు కొనసాగాయి. హైదరాబాద్‌‌, ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. 16 కేసుల్లో రూ.1,100 కోట్ల బ్యాంకు మోసాలకు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం దాడులకు సంబంధించి వివిధ సంస్థలు, బ్యాంకు అధికారులు, వ్యక్తులపై 30కి పైగా ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసినట్టు తెలిసింది. ఏఏ కేసులకు సంబంధించి సోదాలు నిర్వహించింది మాత్రం సీబీఐ అధికారికంగా వెల్లడించలేదు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్‌‌ మోడీ, మెహుల్‌‌ చోక్సీ వంటి కేసుల్లో ప్రభుత్వం ఎన్నికల సమయంలో పలు విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అవినీతిపై పోరాటానికి ప్రభుత్వం సిద్ధమైందని పలువురు విశ్లేషిస్తున్నారు.

లక్నోలో 11 చోట్ల సోదాలు

దేశవ్యాప్త దాడుల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నోలో సీబీఐ 11 చోట్ల సోదాలు చేసింది. మాయావతి సీఎంగా ఉన్నప్పుడు షుగర్‌‌ మిల్స్‌‌లో డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ స్కామ్‌‌కు సంబంధించి సోదాలు చేసినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. మాయావతి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన మాజీ ఐఏఎస్‌‌లు నేత్రమ్, వినయ్ ప్రియా ధూనే, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ సింగ్ కుమారులు వాజిద్ అలీ, మహ్మద్ జావేద్‌‌ల ఇండ్లలో తనిఖీలు చేశారు. షుగర్‌‌ స్కామ్‌‌కు సంబంధించి 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీలో హర్యానా మాజీ సీఎం భూపేందర్‌‌ సింగ్‌‌ హుడా ఇండ్లలోనూ అధికారులు సోదాలు చేశారు.