‘చిత్రపురి’ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలె : కె. నారాయణ

‘చిత్రపురి’ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలె : కె. నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్  

హైదరాబాద్, వెలుగు: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ. 300 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హౌసింగ్‌‌‌‌ సొసైటీ నిర్వహించారని, సినిమా పరిశ్రమతో సంబంధం లేనివారికి ప్లాట్లు, విల్లాలు కేటాయించారని ఆరోపించారు. సొసైటీ భూములని తాకట్టుపెట్టి, నిధులను అడ్డగోలుగా వినియోగించి, కోట్లలో అడ్వాన్సుల పేరుతో ఇష్టానుసారం చెల్లించి కమీషన్లు దండుకున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, సినీ దర్శకుడు మద్దినేని రమేష్ బాబుతో కలిసి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలను కె. నారాయణ శుక్రవారం సందర్శించారు. 

వచ్చే నెల 7న చలో రాజ్ భవన్

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం మగ్దూంభవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా గుర్తించిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ప్రారంభిస్తామన్నారు. టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో నడిచే అవకాశాలు ఉన్నాయన్నారు. అన్ని నియోజకర్గాల్లో ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 25 బలమైన నియోజకవర్గాలను గుర్తించామన్నారు. రాష్ట్రంలో తమతో కలవాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం కమ్యూనిస్టులతో కలవడంలేదన్నారు.