నకిలీ సీబీఐ అధికారి కేసులో..మంత్రి గంగులకు నోటీసులు

నకిలీ సీబీఐ అధికారి కేసులో..మంత్రి గంగులకు నోటీసులు
  • ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

కరీంనగర్, వెలుగు: పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు బుధవారం సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్​ కేసులో గురువారం ఢిల్లీలోని కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. కరీంనగర్ లోని గంగుల ఇంటికొచ్చిన ఆఫీసర్లు.. మంత్రి లేకపోవడంతో వారి సోదరుని కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చి సంతకాలు తీసుకున్నారు. 15 రోజుల కింద హైదరాబాద్​లో జరిగిన కాపు సమ్మేళనంలో గంగుల కమలాకర్​తో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. మూడు నాలుగేండ్లుగా సీబీఐలో పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు.

మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఫొటోలు దిగాడు. శ్రీనివాస్ ను మూడు రోజుల కింద ఢిల్లీలోని తమిళభవన్ లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించే క్రమంలో ఫోన్ లో మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఫొటోలు కనిపించాయి. శ్రీనివాస్ కు వీరితో ఉన్న సంబంధం ఏంటి..? అతనికి ఏమైనా డబ్బులిచ్చారా..? ఎప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది? వీళ్లు ఎప్పుడెప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి గంగులను ఢిల్లీకి రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది.