కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళ సినీ నటుడు విజయ్కు సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళ సినీ నటుడు విజయ్కు సీబీఐ నోటీసులు

చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్కు సీబీఐ సమన్లు పంపింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జనవరి 12న విచారణకు హాజరు కావాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విజయ్కు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్లో విచారణకు విజయ్ హాజరుకావాల్సి ఉంది. తమిళనాడులోని కరూర్లో 2025, సెప్టెంబర్ 27న విజయ్ పార్టీ టీవీకే బహిరంగ సభ, రోడ్ షో జరిగిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు.

ఈ బహిరంగ సభకు విజయ్ హాజరు కావడంతో అతనిని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ విషాదానికి బాధ్యులెవరో తేల్చాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసులో సీబీఐ విచారణను సమీక్షించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది.

అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
సెప్టెంబర్ 27న జరిగిన ఈ ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా, విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో గంటగంటకూ జనం రద్దీ పెరిగింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే  దాదాపు 30 వేల మంది జనం పోగయ్యారు. అయితే, మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండటంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా.. ఆయనను దగ్గర నుంచి చూసేందుకని జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు.

Also Read :  ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ ట్రీట్

ఈ సందర్భంగా కొందరు కిందపడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కిందపడిపోయారు. జనం ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్లు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. 

ఈ సందర్భంగా అంబులెన్స్లకు దారి ఇవ్వాలంటూ బస్​ పైనుంచి విజయ్ సూచించడం వీడియోల్లో కనిపించింది. అలాగే తీవ్ర వేడితో ఊపిరాడక కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో విజయ్ వాటర్ బాటిల్స్ విసిరేయడం కూడా కనిపించింది. ఇలా విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీ 41 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉండటం మరింత శోచనీయం.