కంప్లయెన్స్​ పెరగడంతోనే జీఎస్​టీ కలెక్షన్ల జోరు

కంప్లయెన్స్​ పెరగడంతోనే జీఎస్​టీ కలెక్షన్ల జోరు
  • కంప్లయెన్స్​ పెరగడంతోనే జీఎస్​టీ కలెక్షన్ల జోరు
  • నెలవారీ సగటు కలెక్షన్​ రూ. 1.67 లక్షల కోట్లు
  • సీబీఐసీ చీఫ్​ సంజయ్​ కుమార్​ అగర్వాల్​

న్యూఢిల్లీ : కంప్లయెన్స్​ (రూల్స్‌‌‌‌ సరిగ్గా అమలు చేయడం) పెరగడం వల్లే నెలవారీ జీఎస్​టీ కలెక్షన్లు ఎక్కువవుతున్నాయని సీబీఐసీ చీఫ్​ సంజయ్​ కుమార్​ అగర్వాల్ గురువారం వెల్లడించారు. రిటర్న్​ల ఫైలింగ్​, రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​లను కొంత కఠినం చేయాలనే జీఎస్​టీ కౌన్సిల్​ తాజా నిర్ణయంతో ఫేక్​ ఐటీసీ (ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​) క్లెయిమ్స్​ను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ఐరన్​ అండ్​ స్టీల్​ సహా  కొన్ని రంగాలలో ఫేక్​ ఐటీసీ బెడద ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. ఏ ఏ రంగాలలో పన్ను ఎగవేత ఉంటోందనే అంశంపై సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఇండైరెక్ట్​ ట్యాక్సెస్​ అండ్​ కస్టమ్స్​(సీబీఐసీ)కి  చాలా సూచనలు వచ్చాయని, వాటన్నింటినీ చర్చించామని వివరించారు. 

ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో జీఎస్​టీ వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లని, ఆ తర్వాత మూడు నెలల్లోనూ కలిపి చూసినా సగటు కలెక్షన్లు రూ. 1.67 లక్షల కోట్లకు పెరిగాయని అగర్వాల్​ చెప్పారు. జీఎస్​టీ వసూళ్లు ఎక్కువవడానికి   జీడీపీ పెరుగుదల ఒక కారణమైతే, కంప్లయెన్స్​ పెరగడం మరో కారణమని వివరించారు. రిస్క్​ బిహేవియర్​ ఎనాలిసిస్ ఆధారంగా 1 శాతం పన్ను చెల్లింపుదారులను మాత్రమే స్క్రూటినీ చేస్తున్నట్లు చెప్పారు. జీఎస్​టీ సిస్టమ్​లోకి మోసగాళ్లు ఎంటరవకుండా చర్యలు తీసుకుంటున్నామని, పన్నులు సక్రమంగా చెల్లించేలా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని అగర్వాల్​ అన్నారు. ఫేక్​ ఐటీసీ ప్రోబ్లమ్​ కొంత క్లిష్టమైనదేనని, దీనిని అధిగమించేందుకు తమకు సలహాలు, సూచనలు చాలానే వచ్చాయని చెప్పారు. ఫేక్​ రిజిస్ట్రేషన్​లను కనుక్కోవడానికి రెండు నెలలపాటు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించగా, 9 వేల బోగస్​ సంస్థలు తేలాయని, అవి రూ. 11 వేల కోట్ల జీఎస్​టీ ఎగ్గొట్టాయని చెబుతూ, ఇప్పటికే రూ. 45 కోట్లను రికవర్​ చేశామని పేర్కొన్నారు.